మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ అంశాన్ని వెలుగులోకి తెచ్చింది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ తిప్పారన్న ఆరోపణలతో జైలుకి కూడా వెళ్లారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో పార్టీలో ఇతర నేతల నుంచి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు వచ్చిందా అంటే… ఈ ప్రశ్నకు సమాధానం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఆయన వ్యక్తిగత అంశంగా మాత్రమే చూస్తున్నామన్నారు! దానికీ కాంగ్రెస్ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు.
అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు రేవంత్ గుర్తించినా, ఆ అంశాన్ని పార్టీలో చర్చలేదనీ, ఆయన సొంత నిర్ణయంతోనే కార్యాచరణ మొదలుపెట్టేశారన్నారు జగ్గారెడ్డి. పార్టీలో ఏ నాయకుడైనా, ఎలాంటి పోరాటం చేయాలనుకున్నా ముందుగా అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుందన్నారు. 111 జీవో వల్ల అక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, ఆ కోణం నుంచి మాత్రమే తాము స్పందిస్తామనీ, రైతులకు న్యాయం జరిగేలా ఆ జీవో ఎత్తేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రేవంత్ మీద కేసును కూడా పార్టీ మీద రుద్దడం సరికాదనీ, ఆయన వ్యక్తిగతంగానే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
ఇదీ పార్టీ తీరు..! రేవంత్ రెడ్డి అరెస్టు కాగానే తూతూ మంత్రంగా ఓ రోజంతా కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ఖండించారు. ఆ తరువాత, అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. నిజానికి, ఫామ్ హౌస్ అంశంపై మీద ఇంత చర్చ జరుగుతున్నా మంత్రి కేటీఆర్ ఇంతవరకూ దానిపై స్పందించనే లేదు! ఈ టాపిక్ మీద ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పోరాటం కొనసాగిస్తామని ఐకమత్యంగా నిలబడి ఉంటే, ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బందిపెట్టే అంశమే అయ్యేది ఇది! కానీ, ఇదిగో.. ఇలా జగ్గారెడ్డిలా అది రేవంత్ వ్యక్తిగత అంశమని సొంత పార్టీ నేతలే తప్పుకుంటే ఇక పోరాటం అనే మాట ఎక్కడుంది? పార్టీలో ముందుగా రేవంత్ చర్చించలేదన్న కారణంతో… పార్టీకి అక్కరకు వచ్చే అంశాన్ని జారవిడుచుకుంటున్నామని గుర్తించే పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు లేరు.