తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. సోమవారం దీని ప్రారంభోత్సవం. అయితే, ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఆయన నిర్వహిస్తుండటం విశేషం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి కీలక నేతలందరినీ ఆయన ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెబుతున్నారు. ఇంతకీ, సొంత ఆఫీస్ ఎందుకంటే… ఎంపీగా ఆఫీస్ పెడుతున్నారని అనుకోవచ్చు. దీంతోపాటు, ఈ కార్యాలయ కేంద్రంగా రాష్ట్ర స్థాయి రాజకీయ కార్యకలాపాలు సాగించాలనే లక్ష్యంతో రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
రేవంత్ ఆఫీస్ అంశం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన సొంతంగా ఒక గ్రూపుని తయారు చేసుకునే వ్యూహంలో ఉన్నారనీ, ఒక కోటరీని తయారు చేసుకుంటారనీ, దాన్లో భాగమే ఈ ప్రయత్నమని అంటున్నవారూ లేకపోలేదు. ఇకపై ఈ ఆఫీస్ లోనే తరచూ రేవంత్ అందుబాటులో ఉండాలని భావిస్తున్నారని సమాచారం. నిజానికి, పీసీసీ కొత్త అధ్యక్షుడి రేసులో రేవంత్ రెడ్డి పేరు మొదట్నుంచీ వినిపిస్తున్నదే. అయితే, కొత్తగా చేరినవారికి ఛాన్స్ ఇవ్వొద్దంటూ రేవంత్ అంటే పడని ఒక వర్గ నేతలు ఇప్పటికే హైకమాండ్ దగ్గర తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఒకవేళ, ఈ ఒత్లిళ్లేవో పనిచేసి, పీసీసీ పీఠం తనకి దక్కకపోయినా… తన ప్రాధాన్యతను మరింత పెంచుకోవాలనే వ్యూహంలో రేవంత్ ఉన్నట్టుగా అనిపిస్తోంది.
ఈ ఆఫీస్ లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. కేవలం మల్కాగిరికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తన పరిధి అన్నట్టుగా త్వరలో ఆయన కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు. చిన్నాపెద్దా అని సంబంధం లేకుండా, ఏ స్థాయి నాయకులు తనను పిలిచినా ఇకపై అన్ని కార్యక్రమాలకూ వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ లో చాలామందికి మింగుడుపడవు కదా! నిజానికి, కాంగ్రెస్ నేతలు ఎవరైనా గాంధీభవన్ నుంచే పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటారు. కానీ, రేవంత్ చర్య ఆ పార్టీ నేతలకు కాస్త కొత్తగా అనిపించేదే. ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వస్తారో చూడాలి.