న్యూ డెలవప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో ఏపీలో నిర్మించాలనుకున్న రూ. ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన రోడ్ల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. రీ టెండర్లను పిలుస్తామని ప్రకటించింది. అయితే.. టెండర్లు పిలవడానికి.. రద్దు చేయడానికి మధ్య జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. నిజానికి న్యూ డెలవప్మెంట్ బ్యాంక్ అనేది ప్రపంచబ్యాంక్ లాంటిది. రుణం ఇస్తే.. అన్నీ ఆ సంస్థ నియమనిబంధనల ప్రకారం చేయాలి. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. రోడ్ల నిర్మాణానికి గ్లోబర్ టెండర్లు పిలవాల్సి ఉంది. పిలిచారు కూడా. కానీ టెండర్లు దాఖలు చేసింది మాత్రం.. గల్లీ సంస్థలు. పెద్ద సంస్థలు ఒక్కటంటే.. ఒక్కటి కూడా టెండర్లు దాఖలు చేయలేదు. జిల్లాల వారీగా విభజించిన పనులకు… కొన్ని సంస్థలే పోటీ పడ్డాయి. అవన్నీ రహదారుల నిర్మాణంలో ఊరూపేరూ లేని సంస్థలే.
ఈ టెండర్లు మొత్తం రింగ్ అయ్యారని… కొంత మందిని టెండర్లలో పాల్గొనకుండా బెదిరించారని.. మీడియాలో విమర్శలు వచ్చాయి. మామూలుగా గ్లోబర్ టెండర్లు పిలిస్తే.. పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ టెండర్లకు మాత్రం రాలేదు. అలాగే ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన కంపెనీలు మాత్రమే రేసులో నిలిచాయి. ఇవన్నీ ప్రజల్లో బాగా చర్చకు వెళ్లాయి. కొన్ని చోట్ల నిబంధనలు కూడా పాటించలేదు. దాంతో చివరికి.. టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. శుక్రవారం మీడియా సమావేశం పెట్టి.. మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి… పరువు నష్టం కేసులు వేస్తామని చెప్పిన కృష్ణబాబు.. తర్వాతి రోజే.. ఆరోపణలు వస్తున్నందున ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే ఏదో జరిగిందనే కదా అర్థం అని టీడీపీ నేతలంటున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండరింగ్, రీ టెండరింగ్, జ్యూడిషియల్ ప్రివ్యూ పేరుతో తచాలా చాలా సంస్కరణలు తెచ్చారు. అయితే.. ఇవేమీ.. ఆరోపణలు రాకుండా అడ్డుకోలేకపోతున్నాయి. కోరనా టెస్టింగ్ కిట్ల దగ్గర్నుంచి ప్రతీ దాంట్లోనూ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు విపరీతంగా వచ్చిన కొన్ని కొన్ని చోట్ల రీటెండరింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు కానీ.. చివరికి.. ఆ టెండర్లు ఎవరికి దక్కాలో వారికే దక్కుతున్నాయన్న విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి.