చై – సమంత విడిపోయారు. వీరిద్దరి పెళ్లి ఎంత సంచలనమో.. విడాకులు అంతకంటే ఎక్కువ సెన్సేషన్ వ్యవహారం అయ్యింది. `మేమిద్దరం విడిపోతున్నాం` అనే క్లూ.. ముందు సమంతనే ఇచ్చింది. `అక్కినేని` అనే ఇంటి పేరు తీసేసి – అభిమానుల్ని ముందస్తుగా ప్రిపేర్ చేసింది. చైతూ ఒక్క ట్వీట్ తో లాంఛనం పూర్తి చేశాడు. మధ్యలో ఎన్ని కథలో, కబుర్లో. `సమంత చైతూ ఎందుకు విడిపోయారు` అనే దానికంటే.. చాలా విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు.. విడాకులకు కూడా అంతకు మించిన హడావుడి, హంగామా మొదలైంది. టీవీ ఛానళ్లలో ఇదే చర్చ. వీటిపైనే స్పెషల్ స్టోరీలు. ఇది వరకు కూడా చాలా మంది సెలబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకుని, కొంతకాలం కాపురం చేశాక… విడిపోయారు. అయితే అప్పటికంటే ఇప్పుడు మరింత అటెన్షన్ పెరిగింది. ఈ జంట విడాకులు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. మరో వారం రోజుల పాటు.. ఇదే హాట్ టాపిక్. మరింతకీ… ఈ విడాకులు ఎన్ని సందేహాలకు తావిచ్చింది. వాటికి సమాధానం ఉందా?
* విడిపోయారు సరే… అయితే కారణం ఎవరు? చైతూనా? సమంతనా? చైతూనే అయితే `అక్కినేని` అనే పేరుని సమంత ముందుగా ఎందుకు తొలగించింది? సమంత అయితే `మేం విడిపోతున్నాం` అంటూ అధికారికంగా చైతూనే ఎందుకు ప్రకటించాల్సివచ్చింది..?
* సమంత భరణం తీసుకుంటుందా? లేదా? సమంతకు రూ.200 కోట్లు భరణంగా ఇవ్వాలని అక్కినేని కుటుంబం ముందుకు వచ్చిందని, దాన్ని సమంత తిరస్కరించిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీటిపై ఎప్పటికీ క్లారిటీ రాదు. ఎందుకంటే ఇది పూర్తిగా వాళ్ల అంతర్గత వ్యవహారం.
* సమంతతో చై గొడవకు `ఫ్యామిలీమెన్ 2`నే కారణమా? అవునన్నది చాలామంది మాట. ఎందుకంటే.. ఫ్యామిలీ మెన్ 2లో సమంత చాలా బోల్డ్ గా నటించింది. అది చైతూకు నచ్చలేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ముంబైలో మకాం పెట్టింది. చైకీ సమంతకీ దూరం పెరగడానికి ఇదో కారణమని టాక్. ఆ మాటకొస్తే… `సూపర్ డిలక్స్`లో సమంత ఇంతకంటే బోల్డ్ గా నటించింది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చింది?
* సమంతకి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదన్నది మరో మాట. తాను చైతో కలసి ఉండడానికి చాలా రకాలుగా ప్రయత్నించిందని, అయితే చై ససేమీరా అన్నాడని తెలుస్తోంది. చైతూ ట్విట్టర్ లో విడాకుల విషయం బయటపెట్టాక… సమంత ఎమోషనల్ గా ట్వీట్ చేసింది. అమ్మ నాకో కథ చెప్పింది అంటూ.. కొంతమంది వెన్నుపోటు పొడిచారు అంటూ పరోక్షంగా తనని ఎవరో మోసం చేశారని ప్రస్తావించింది. సమంతని మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. వీటికి సమాధానాలు దొరకడం చాలా కష్టం. ఓరకంగా విడాకులు అనేది వ్యక్తిగత వ్యవహారం. చాలామంది జీవితాల్లో ఇది జరిగేదే. కానీ సెలబ్రెటీలు అయ్యేసరికి అది హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఏదేమైనా చై – సమంత తమ జీవితాల్లో ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి రావడానికి వాళ్లు చాలా మానసిక క్షోభని అనుభవించి ఉంటారు. వాటిని అందరూ అర్థం చేసుకోవాల్సిందే. చై – సమంత ఎవరికి వాళ్లు కొత్త జీవితాన్ని మొదలెట్టాల్సిన తరుణమిది. మీడియా కూడా వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛని, ఇష్టాల్నీ అర్థం చేసుకుని, ఈ విషయంపై చిలవలు పలవలుగా వార్తలు వండకుండా వదిలేయడమే మంచిది.