హాస్య నటుడి నుంచి హీరోగా ఎదిగాడు సునీల్. తొలినాళ్లలో హీరోగా మంచి సినిమాలే పడ్డాయి. రాజమౌళి సినిమాలో `మర్యాద రామన్న`గా కనిపించి మెప్పించాడు. సిక్స్ ప్యాకులూ, డాన్సులతో అరదగొట్టాడు. మొత్తానికి హీరోగా ఓకే అనిపించుకున్న తరవాత.. వరుస ఫ్లాపులు దండెత్తాయి. కష్టపడి తెచ్చుకున్న తన కండలే… తన కెరీర్ కి అడ్డంకిగా మారాయి. సునీల్ కామెడీ టైమింగ్ మిస్సయి, హీరోయిజం ఫెయిల్ అయ్యి.. అటు తిరిగి, ఇటు తిరిగి మళ్లీ హాస్య పాత్రలపైనే దృష్టి పెట్టాడు. `అరవింద సమేత`, `చిత్రలహరి`లలో మంచి పాత్రలు పడ్డాయి. `కలర్‌ఫొటో`లో విలన్ గానూ కనిపించబోతున్నాడు. ఈ ఇన్నింగ్స్ కూడా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో.. మళ్లీ హీరోగా టర్న్ తీసుకున్నాడీ అందాల రాముడు.
`హీరో పాత్రలు చేయను` అని ఇది వరకే స్ట్రాంగ్ గా నిర్ఱయించుకున్న సునీల్.. ఇప్పుడు మళ్లీ హీరో కలలు కంటున్నాడు. 14 రీల్స్ కొత్త చిత్రం `వేదాంతం రాఘవయ్య`లో తనే హీరో. ఈ సినిమా ఒప్పుకోవడానికి సునీల్ ముందు చాలా కారణాలే ఉన్నాయి. హాస్య నటుడిగా ఇప్పుడు సినిమాలు చేస్తున్నా, గతంలో మాదిరిగా గుర్తిండిపోయే పాత్రలేవీ పడలేదు. అందుకే హీరోయిజంపై మనసు మళ్లి ఉంటుంది. పైగా.. హరీష్ శంకర్ రాసిన కథ ఇది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం 14 రీల్స్ లో సునీల్ హీరోగా ఓ సినిమా చేయాలి. ఇది ఇప్పటి ఒప్పందం కాదు. పైగా `వేదాంతం రాఘవయ్య` హీరోయిజాన్ని నమ్ముకున్న కథ కాదని తెలుస్తోంది. `అందాల రాముడు`, `మర్యాద రామన్న`లా ఓ అమాయకుడి కథ అట. ఇలా ఏ రకంగా చూసినా… సునీల్ టెమ్ట్ అయ్యే విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. అందుకే మళ్లీ ఇటు వైపు రావాల్సివచ్చింది. అయితే గతంలో హీరోగా చేస్తున్నప్పుడు కామెడీ పాత్రలు చేయడానికి సునీల్ ఒప్పుకోలేదు. ఈసారి అలా కాదట. రెండు పడవల ప్రయాణం చేయడానికి సునీల్ సిద్ధమైపోయాడు. చేతిలో ఉన్న హాస్య పాత్రల్ని వదిలే ప్రసక్తి లేదంటున్నాడు సునీల్. ఇదైతే మంచి నిర్ణయమే మరి.