ఓటమిపై తెలుగుదేశం పార్టీలో ఇంకా సుదీర్ఘ విశ్లేషణలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా, పార్టీకి కంచుకోట అనుకున్న నియోజక వర్గాల్లో టీడీపీ ఓటమిపై మరింత లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాపై పార్టీ నాయకత్వం ప్రత్యక దృష్టి పెట్టింది. 2014 ఎన్నికల్లో ఆ జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ, గడచిన ఎన్నికల్లో తీవ్రమైన ఎదురుదెబ్బ టీడీపీకి తగిలింది. అంతేకాదు, రాష్ట్రంలో టీడీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిన రెండు నియోజక వర్గాలూ ఇదే జిల్లాలో ఉండటం విశేషం. దీంతో, నియోజక వర్గాల వారీగా ఓటమి కారణాలపై ఆరా తీస్తుంటే… టీడీపీ నేతల స్వయంకృతమే అని ఆ పార్టీ నేతలే ఇప్పుడు వాపోతున్న పరిస్థితి.
పోలవరం, గోపాలపురం ఈ రెండూ టీడీపీకి కంచుకోటలు. కానీ, ఈ రెండు చోట్లా ఘోరంగా పార్టీ ఓడిపోయింది. వీటితోపాటు, పోలవరం నియోజక వర్గంలో కూడా వైకాపాకు భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే, ఈ మూడు చోట్లా టీడీపీ మీద ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం కావడానికి కారణం స్థానిక నేతల తీరుతోపాటు, పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు కూడా కొంప ముంచిందని ఇప్పుడు ఆ జిల్లా నేతలు వాపోతున్నారు. జిల్లాలో తన ఆధిపత్యం చెలాయించాలని ముళ్లపూడి బాపిరాజు తీవ్రంగా ప్రయత్నించారట. ఈ ప్రాంతంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారనీ, పార్టీలో చాలామందికి ఆయనంటే గిట్టేది కాదనీ, అదే విషయాన్ని అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినా కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయిందనీ, దాంతో పార్టీ నాయకులే వ్యతిరేకంగా పనిచేయాల్సిన వాతావరణం ఏర్పడిందని జిల్లా నేతలు ఇప్పుడు చెబుతున్నారు. ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ కాకముందు వరకూ పార్టీ పరిస్థితి బాగుండేదని అంటున్నారు.
చివరికి సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కూడా ఆయన జోక్యం ఎక్కువైందనీ, పట్టుబట్టి కొంతమందిని ఆయనే మార్పించారనీ, లేదంటే ప.గో.లో టీడీపీకి దక్కే స్థానాల సంఖ్య పెరిగి ఉండేదని నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని పార్టీ నాయకత్వం గుర్తించాలనీ, లేదంటే కోలుకోవడం అంత సులువు కాదని నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ చేపట్టినా, ఎన్నికల్లో అవేవీ అక్కరకు రాకుండా పోవడానికి లాంటి నాయకుల ఆధిపత్య ధోరణే కారణమనీ, వారిని మార్చితే టీడీపీకి మంచి రోజులు వెంటనే వస్తాయని ప.గో. జిల్లా నేతలు అధినేత చంద్రబాబుకు కొన్ని నివేదికలు పంపినట్టు సమాచారం. బాపిరాజు రాక ముందు.. వచ్చాక టీడీపీ పరిస్థితి ఎలా ఉందనే లెక్కలు చంద్రబాబుకి అందాయని అంటున్నారు.