శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కారణంగా ఆరుగురు చనిపోయారు. ఇది అత్యంత ఘోర విషాదం. ఇటీవలి కాలంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలన్న ఓ అభిప్రాయం బలంగా పెరిగిపోయింది. అందు కోసం చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గత పదేళ్ల నుంచి ఇది అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. ఈ సారి ఇంకా ప్రచారం ఎక్కువగా ఉంది. పది రోజుల పాటు ద్వార దర్శనాలు ఉంటాయని చెబుతున్నా భక్తులు లెక్క చేయడం లేదు. టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వచ్చారు.
తిరుపతిలో పలు చోట్ల టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లు కూడా పెట్టారు. టిక్కెట్లు ఇచ్చే సమయం ఇంకా ప్రారంభం కాలేదు. అయినా విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది.దీనికి కారణం భక్తుల కంగారు ..టిక్కెట్లు దొరకవేమోనన్న ఆందోళనే. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించని టీటీడీ అదికారులది కూడా తప్పే. టిక్కెట్లు ఇచ్చే ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ మూడు, నాలుగు రోజుల ముందు నుంచీ పరిశీలిస్తున్నట్లుగా మీడియా ప్రకటనలు ఇచ్చారు. కానీ భక్తులు ఎంత మంది వస్తారో అంచనా వేయకపోవడంతో ఆ ఏర్పాట్లేమీ సరిపోలేదు.
అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా భక్తుల్ని ఇలా క్యూ లైన్లలో నిలబడి టిక్కెట్లు తీసుకోమని ఎవరు ముందు వస్తే వారికి టిక్కెట్లు అన్నట్లుగా చేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఇలా జన సమూహాలు ఏర్పడకుండా చూడాల్సిన అవసరం పడింది. ప్రస్తుతం జన సమూహాల్లో పక్కనవాళ్లు చచ్చిపోతారని.. ఎవరూ అనుకోవడం లేదు. ఎవరి గోల వారిది. ఈ క్రమంలో ప్రాణాలు పోతున్నాయి. తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో శవ రాజకీయాలు కామన్. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. శవాలు దొరికితే కొన్ని పార్టీలు రెచ్చిపోతాయి. ఆ రాజకీయాల ప్రభావం పడకుండా.. ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.