అన్ని పార్టీల కాపు నేతలు హైదరాబాద్లో రహస్యంగా సమావేశం అయిన విషయం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వారంతా కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. మరో వైపు కాదు.. కుల ప్రాధాన్యను గట్టిగా కాపాడుకోవడం కోసం ప్రయత్నం అని మరికొంత మంది చెబుతున్నారు. వంగవీటి రాధా నుంచి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ వరకూ అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ సహా ఇతర పార్టీల కాపు నేతలు హాజరయ్యారు.
కాపుల కోసం ప్రత్యేక పార్టీపెడితే కాపులు మాత్రమే ఓట్లు వేస్తారని.. ఇది కాపులకు ఏ మాత్రం మేలు చేయకపోగా ఇతర వర్గాలతో దూరం చేస్తుందని కొంత మంది అభిప్రాయపడ్డారు. అయితే మరికొంత మంది మాత్రం కాపు ఓటు బ్యాంక్ మొత్తం స్థిరంగా ఉంటే.. ఇతర పార్టీలన్నీ తమ వెంటనే వస్తాయని… నమ్ముతున్నారు. కుమారస్వామి సీఎం అయినట్లుగా కాపు నేత కూడా సీఎం అవుతారని విశ్లేషించారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారన్నదానిపై స్పష్టత లేదు.
ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాజకీయ లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్ని పార్టీల నేతలూ అంచనాలు వేస్తున్న సమయంలో ఇప్పుడు సామాజిక సమీకరణాలు సరిగ్గా కుదిరితే ప్రభుత్వం మారిపోవడం ఖాయమని లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలో కాపు వర్గం అంతా ఏకమయ్యే ప్రయత్నం చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి ఇప్పిటకే జనసేన పార్టీకి కాపులు అండగా ఉంటున్నారు . కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న చోట్ల జనసేన ప్రభావం చూపుతోంది. ఇప్పుడు వీరంతా వేరు బాట పడితే జనసేన నిర్వీర్యం కావడం … కాపు వర్గంలో చీలిక తప్ప మరో ప్రయోజనం ఉండదన్న విశ్లేషణలు ఉన్నాయి. వీరి మీటింగ్ ఎజెండా ఏమిటి అనేది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.