అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి గెలవడానికి మోడీనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇండియన్ అమెరికన్స్ ఓట్ల కోసం మోడీని అదేపనిగా పొగిడేస్తున్నారు. అగ్రరాజ్యంలో దాదాపు 12 లక్షల మంది ఇండియన్ అమెరికన్ల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడున్న సమయంలో ఇవి చాలా కీలకం..! నిజానికి గతంలో ఈ ఓట్లు డెమోక్రాట్లకు అత్యధికంగా పడేవి..! కానీ ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని అటు మళ్లాయి. ఇప్పుడు మోదీ, ట్రంప్ స్నేహంతో సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఇందులో వర్గాల వారీగా విడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ వైట్స్, బ్లాక్స్‌తో పాటు ఎక్కడిక్కడ విభజన కనిపిస్తోన్న సమయంలో ఇండియన్ అమెరికన్ల ఓట్లు పార్టీలు పోటీ పడుతున్నాయి.
అమెరికాలో మనోళ్ల ఓట్ల కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎమోషనల్‌గా టచ్ చేస్తున్నాడు. మోదీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటున్న ట్రంప్.. భారతీయుల ఓట్లన్నీ నాకేనని చెప్పుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. తన పిల్లలు ఇవాంక, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లు భారత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని.. తనకు కూడా భారత్ అంటే ఇష్టమని చెబుతున్నారు. వాళ్ల సెంటిమెంట్లు అంటే ఇష్టమని అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ ఇండియా గురించి ప్రస్తావించడం వెనుక ప్రధాన కారణం ఇండియన్ అమెరికన్ల ఓట్లే.
ట్రంప్ టీమ్ మొత్తం ఇండియాను సెంటిమెంట్‌తో కాకా పట్టేందుకు ప్రయత్నిస్తుంది. ప్రవాస భారతీయుల్లో మోదీపై ఉన్న క్రేజ్‌ను కూడా ట్రంప్ టీమ్ క్యాష్ చేసుకోవాలన్న ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు డెమోక్రాట్లు భారత సంతతికి చెందిన కమలా హరిస్‌ను వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. కమలా హరిస్ తల్లి భారతీయురాలు. తండ్రి ఆఫ్రికన్. దీంతో అటు ఆఫ్రో అమెరికన్, ఇటు ఇండియన్ అమెరికన్ ఓట్లు గుంపగుత్తగా వస్తాయని భావిస్తున్నారు. అందుకే డెమోక్రాట్లకు భిన్నంగా ట్రంప్ ఎమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం.. ఒకటి.. రెండు శాతం ఓట్ల మధ్యనే ఉంటుంది. ఆ ఫలితాన్ని తేల్చేది ప్రవాస భారతీయుల ఓట్లేనని ట్రంప్ హడావుడి చూస్తే తేలిపోతోంది.