విచారణ పేరుతో తనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేధిస్తున్నారని… టీవీ5 మూర్తి ఓ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే పోలీసులు.. టార్గెట్ పెట్టుకుని మరీ.. కొంత మందిని హరాస్ చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఏపీ పోలీసులు తన పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని మూర్తి బయట పెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అసలు సంబంధం లేని కేసులో మూర్తిపై కేసు పెట్టడమేకాదు.. బెయిల్ తెచ్చుకున్న తర్వాత… వారానికి మూడు, నాలుగు రోజులు విచారణ పేరుతో విజయవాడకు పిలిపించి.. ఖాళీగా కూర్చోబెట్టి పంపిస్తున్నారు. పిలిపించినందుకు తీసుకోవాలి కాబట్టి.. ఏదో ఓ స్టేట్మెంట్.. అరగంట పాటు తీసుకుంటున్నారు.
కొన్నాళ్ల కిందట… యూనివర్శిటీ పాలక మండళ్లను ఏపీ సర్కార్ నియమించింది. ఆ నోట్ ఫైల్.. ఎవరెవరు.. సిఫార్సు చేశారో.. ఎవరెవర్ని నియమించారో ..మాజీ న్యాయమూర్తి శ్రావణ్.. టీవీ5 చర్చా కార్యక్రమంలో బయట పెట్టారు. అది ఆయన బయటపెట్టారు. ఆ షోకి యాంకర్‌గా టీవీ5 మూర్తి ఉన్నారు. అంతేపోలీసులు మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌తో పాటు మూర్తిపైనా.. టీవీ5 యజమానిపైనా కేసులు పెట్టారు. వారు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ సహజంగా బెయిల్ షరతుల్లో… విచారణకు సహకరించాలని ఉంటుంది. దీన్నే పట్టుకున్న ఏపీ పోలీసులు చీటికిమాటికి..విచారణ పేరుతో.. మూర్తిని విజయవాడకు పిలుస్తున్నారు.
ఇటీవలి కాలంలో.. టీవీ5 మూర్తి స్క్రీన్ పైకి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఆయన షోలు తగ్గిపోయాయి. దీనికి కారణం ఆయన విచారణ కోసం.. తరచూ విజయవాడ వెళ్తూండటమే. విచారణకు ఎప్పుడైనా వెళ్లకపోతే… సహకరించడం లేదని చెప్పి.. బెయిల్ క్యాన్సిల్ చేయించేదుకు పోలీసులు ఇలా చేస్తున్నారని.. మూర్తి నమ్ముతున్నారు. అందుకే.. పోలీసుల వేధింపుపై వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎంత చేసినా… తాను వెనక్కి తగ్గనని.. కావాలంటే… తన ఊపిరి తీసుకోవచ్చని ఆయన ప్రకటించేశారు.