ఈమధ్య సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్ పేరు బాగా నానింది. దానికి కారణం.. తను నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లలో వెన్నెల కిషోర్ ఎక్కడా కనిపించలేదు. హీరో అయ్యుండి, ప్రమోషన్లకు రాకపోవడమేమిటి? అనే ప్రశ్న దర్శక నిర్మాతలకు ఎదురైంది. వాళ్లు తమకు తోచిన కారణాలు చెప్పారు. వెన్నెల కిషోర్ బిజీగా ఉన్నాడని, తాను ఇంట్రావర్ట్ అని, విదేశాల్లో ఉన్నాడని రకరకాల రీజనింగులు వేశారు. లక్షలు లక్షలు పారితోషికాలు తీసుకొని, ప్రమోషన్లకు రాకపోవడం ఏమిటని చాలామంది వెన్నెల కిషోర్‌ని విమర్శించారు.
అయితే.. వెన్నెల కిషోర్ సన్నిహితుల వెర్షన్ మరోలా వుంది. ఈ సినిమా కోసం కేవలం పది రోజుల కాల్షీట్లు తీసుకొన్నార్ట నిర్మాతలు. అది కూడా ‘ఇందులో నువ్వే హీరో’ అని చెప్పలేదట. మామూలుగా తాను కమెడియన్ గా చేసినప్పుడు ఎలా పారితోషికం తీసుకొంటాడో అలానే తీసుకొన్నాడని, ఈ సినిమాలో ఓ పాత్ర మాత్రమే చేస్తున్నానని వెన్నెల కిషోర్ అనుకొన్నాడని, కానీ తీరా చూస్తే పోస్టర్లలో తనని హీరోగా ప్రమోట్ చేశారని, ఇది వెన్నెల కిషోర్‌కి నచ్చలేదని, ‘హీరో అని ముందు ఎందుకు చెప్పలేదు’ అని నిలదీశాడని, ఈ విషయంలో నిర్మాతకీ వెన్నెల కిషోర్‌కీ మధ్య క్లాష్ వచ్చిందని, అందుకే ప్రమోషన్లకు రాలేదని చెప్పుకొచ్చారు.
కమెడియన్లు హీరో వేషాలేయ్యడం మామూలే. కానీ హీరో అని తెలిస్తే… ఆయా సినిమాలపై ప్రత్యేకమైన శ్రద్ద పెడతారు. రెమ్యునరేషన్ కూడా బాగానే ఆశిస్తారు. ‘నీది ఓ క్యారెక్టర్ మాత్రమే’ అని చెప్పి, పది రోజులు షూట్ చేసి, చివరికి హీరో అని బిల్డప్ ఇచ్చేసరికి వెన్నెల కిషోర్ కి ఏం అర్థం కాలేదు. అందుకే ప్రమోషన్లకు ఎగనామం పెట్టేశాడు. ఈనెల 25న ఈ సినిమా విడుదలైంది. ఆశించిన ఫలితం రాలేదు. వెన్నెల కిషోర్ ప్రమోషన్లకు వచ్చినా ఈ సినిమా ఫలితంలో తేడా వచ్చేది కాదేమో..?!