విజయవాడ శివార్లలో కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఒకే సారి వంద గోవుల మృతి వెనుక ఏదో సీక్రెట్ ఉందన్న అనుమానం అంతకంతకూ బలపడుతోంది. ఈ విషయంలో పోలీసులు.. నిన్నటి దాకా.. ఎలాంటి అనుమానాల్లేవని చెబుతూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా… డీజీపీ గౌతం సవాంగ్ రంగంలోకి దిగారు. గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. నిజానిజాలు బయటపెట్టే వరకు సిట్ పనిచేస్తుందని ప్రకటించారు. కచ్చితంగా మిస్టరీ ఉందని.. దాన్ని ఎలాగైనా చేధించాలని డీజీపీ నిర్ణయించారు. పశుసంవర్థకశాఖ, ఫోరెన్సిక్ సైన్స్, ప్రకాశం జిల్లా నుంచి ఆవులకు గడ్డి అందించేవారిని ..అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
నిన్నటి వరకూ.. నిర్వాహకులు, పోలీసులు చిత్ర విచిత్రమైన కారణాలు చెబుతూ వస్తున్నారు. ఒకసారి అధిక ఆహారం వల్ల అంటారు.. మరో సారి.. గడ్డిపై.. రసాయనాలు ఉన్నాయంటారు.. మరో సారి ఏం జరిగిందో అర్థం కావడం లేదని చెబుతూంటారు. అయితే.. ఆవుల పోస్టు మార్టంలో.. కచ్చితంగా విష ప్రయోగం జరిగిందన్న విషయం మాత్రం.. ప్రాథమికంగా తేలింది. దీందో.. ఏదో గూడు పుఠాణి ఉందని మాత్రం అందరిలో అనుమనాలు తలెత్తుతున్నాయి. మామూలుగా ఒక్క గోవు మృతి చెందితేనే శివాలెత్తే స్వాములు.. బీజేపీ నేతలు.. మూడు రోజుల పాటు సైలెంట్ గానే ఉన్నారు. హఠాత్తుగా… తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు సోమవారం గోశాలలో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ మాధవ్ లు అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు చెప్తున్న విధంగా పచ్చగడ్డి పాయిజన్ అయ్యుంటే ఇన్ని ఆవులు ఒకేసారి చనిపోయి ఉండేవికాదన్నారు.
అయితే.. అక్కడ జరిగిన వ్యవహారాలు.. పూర్వపరాలపై.. బీజేపీ నేతలకు.. కొంత సమాచారం అందింది. గోశాల ఉన్న ఎడెకరాల భూమిపై .. వైసీపీకి చెందిన ఓ నేత కన్నేశారని.. ఆ కుట్రలో భాగంగానే .. ఈ గోవులు మృత్యువాత పడ్డాయన్న ప్రచారం గుప్పుమింది. దీన్ని బీజేపీ నేతలు కూడా చర్చించుకున్నారు. అదే సమయంలో… నిర్వాహకుల మధ్య ఉన్న విబేధాలు, స్థలం గొడవ మొత్తం వ్యవహారాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. అన్ని గోవులు ఒక్క సారిగా సహజమరణం చెందే అవకాశం లేదని… సులువుగా ఎవరికైనా అర్థమైపోతుంది. మరి ఈ మిస్టరీని పోలీసులే వెలికి తీయాల్సి ఉంది.