ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారంటే సహజంగానే రాజకీయవర్గాల్లో ఆసక్తి ఏర్పడుతుంది. మొత్తం మూడు రోజుల పాటు గవర్నర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలో డిల్లీలో గవర్నర్ల సదస్సుకు గౌరవ బిశ్వభూషణ్ హాజరు అవుతారు. సదస్సు గురువారం జరగుతుంది.
ఏపీ పరిస్థితులపై గవర్నర్.. రాష్ట్రపతికి నివేదిక అందిస్తారు. ఒక్క బిశ్వభూషణే కాకుండా అన్ని రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి నివేదికలు సమర్పిస్తారు. ఈ సమావేశానికి ఒక రోజు ముందే గవర్నర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు. మర్యాదపూర్వక భేటీనే అని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆయన ఇంకా ఎవరెవరితో సమావేశమవుతారో స్పష్టత లేదు. ఇటీవల తెలుగుదేశం ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గవర్నర్ పర్యటన సహజంగానే ఆసక్తి రేపుతోంది. అయితే ఎలాంటి రాజకీయ సంచలనాలు ఉండబోవని.. రొటీన్ సమావేశానికే గవర్నర్ వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.