ఐదేళ్ల కిందట ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందును విశాఖకు రైల్వేజోన్‌ను కేంద్రం కేటాయించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో టీడీపీ బీజేపీతో కటీఫ్ చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. టీడీపీకి పోటీకి వైసీపీ కూడా ఉత్తుత్తిపోరాటం చేసింది. అందరూ తమ విజయమేనని క్లెయిమ్ చేసుకున్నారు. అయితే ఐదేళ్లు అయినా ఇప్పటికీ రైల్వే జోన్ ఓ కలగానే మిగిలింది. కనీసం పనులు ప్రారంభం కాలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే… మంజూరు అయిన రైల్వే జోన్ పనులు ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తారనుకున్నారు. కానీ ప్రశ్నించడమే మానేశారు. వాస్తవానికి అవసరమైన భూములు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ కేంద్రం రూపొందించిన డీపీఆర్‌లో యాభై మూడు ఎకరాల భూములు కావాలని తేల్చారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు. కానీ జోన్ అవసరం లేదన్నట్లుగా ఏపీ సర్కార్ ఉంది. యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు. పైగా రైల్వే భూమిని ఇతర అవసరాల కోసం తీసుకుంది.
విశాఖలో గత ఐదేళ్లుగా కొన్ని వేల ఎకరాల భూదందా జరిగింది. చివరికి రామానాయుడు స్టూడియోనూ కూడా కబ్జా చేశారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. . కానీ ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నం అయిన రైల్వేజోన్ కోసం యాభైమూడు ఎకరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. రైల్వేజోన్ వస్తే జగన్ రెడ్డికి ఏదో నష్టం ఉందని… లేకపోతే విశాఖ … ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న కారణంగా భూములు ఇవ్వలేదన్న అభిప్రాయం వినిపిస్తోది. కేంద్రం మంజూరు చేసినా.. దాన్ని తెచ్చుకోలేనంత అసమర్థత జగన్ రెడ్డి సర్కార్ లో పేరుకుపోయింది.