తెలంగాణ సీఎం కేసీఆర్తో ఎంతో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ… తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కు ఆర్టీసీ బస్సుల్ని తిప్పుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం.. అంగీకరించకపోవడమే దీనికి కారణం. ఏపీ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులు ఎన్ని వస్తున్నాయో.. అన్ని బస్సులు.. తాము ఆంధ్రకు పంపిస్తామని తెలంగాణ సర్కార్ పట్టుబడుతోంది. అక్కడే సమస్య వస్తోంది. రెండు, మూడు సార్లు అధికారుల స్థాయిలో చర్చలు జరిగినా.., పరిష్కారం కాలేదు. తెలంగాణ సర్కార్ చేస్తున్న డిమాండ్ వల్ల.. ఏపీఎస్ఆర్టీసీకి పెద్ద ఎత్తున ఆదాయం నష్టం వస్తుంది. అందుకే… ఏపీ అధికారులు నాన్చుతున్నారు. కేబినెట్ సమావేశం సందర్భంగా.. తెలంగాణకు బస్సులు నడిపే అంశాన్ని మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
పరిస్థితి మొత్తం తెలుసుకున్న తర్వాత అవసరమైతే న్యాయసలహా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అంటే.. న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లే లెక్క. ఇప్పటికి ఏపీ నుంచి బెంగళూరుకు బస్సులు ప్రారంభమయ్యాయి. చెన్నైకు.. ఒడిషాకు కూడా నడుస్తున్నాయి. కానీ హైదరాబాద్కు మాత్రం నడవడం లేదు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే బస్సుల్లో ఇప్పటి వరకూ 95 శాతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులే ఉంటాయి. తెలంగాణ డిపోలకు చెందిన బస్సులు అతి తక్కువగా ఉంటాయి. ఏపీలోని ప్రతి డిపో నుంచి హైదరాబాద్కు బస్సులు ఉంటాయి. ఆ రూట్లో వచ్చే ఆదాయం.. చాలా ఎక్కువ. ఇప్పుడు.. ఆ రూట్లో వాటాను తెలంగాణ అడుగుతోంది. ఇప్పటికే ఏపీఆర్టీసీ అనేక రకాల సమస్యను ఎదుర్కొంటోంది. ఆదాయం చాలాతగ్గిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో… హైదరాబాద్ రూట్లో తెలంగాణకు వాటా ఇస్తే ఇబ్బందికరమే. ఆ రూట్లో వచ్చే లాభం ఏంటో తెలుసు కాబట్టే… తెలంగాణ సర్కార్ కూడా… ఒప్పందం కోసం పట్టుబడుతోంది. ఒప్పందం చేసుకుంటేనే.. బస్సులు తిప్పుకోవడానికి అంగీకరిస్తామని అంటోంది. ఏం చేయాలో తెలియని.. ఏపీ సర్కార్.. న్యాయసలహా దిశగా ఆలోచన చేస్తోంది. సన్నిహిత సంబంధాలతో… ఈ సమస్యను పరిష్కరించుకుంటే మేలు కానీ… న్యాయపోరాటం అంటే.. మొత్తానికి సమస్య జఠిలం అయ్యే ప్రమాదం ఉంది.