సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతాడు అన్నది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్యన అయితే ఒకరోజు టిడిపి అని, ఒకరోజు బిజెపి అని, మరొక రోజు లోక్ సత్తా అని, ఇంకొకసారి సొంత పార్టీ పెడుతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ పోయి టిడిపి యా జనసేన నా అన్న చర్చ నడుస్తోంది.
నిజానికి లక్ష్మీనారాయణ రిటైర్మెంట్ తీసుకున్న మొదటి రోజే ఆయన జనసేన లో చేరబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా గత ఏడాది మార్చి 14న సభ నిర్వహించడానికి ముందు రోజు లక్ష్మీనారాయణ నుంచి “ఆల్ ది బెస్ట్” అన్న మెసేజ్ వచ్చిందని అప్పట్లో చెప్పాడు. లక్ష్మీ నారాయణ కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ తో తన సాన్నిహిత్యం గురించి చెప్పాడు. అయితే ఆయన జనసేన లో చేరతాడని అందరూ అనుకున్న సమయంలో, జనసేన కాకుండా టిడిపిలో చేరుతారని, లోక్ సత్తాను టేకోవర్ చేస్తున్నాడని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. కచ్చితంగా జనసేన లో చేరుతాడు అనుకున్న లక్ష్మీనారాయణ వేరే ఆప్షన్స్ పరిశీలించాల్సి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.
మొన్న లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతాడని వార్తలు వచ్చిన వెంటనే ఒక టీవీ ఛానల్ లో ఈ విషయంపై జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ స్పందించాడు. లక్ష్మీ నారాయణ జనసేన లో చేరే అవకాశం ఇప్పటికీ ఉందని, ముందుగానే మీరు ఆయన టిడిపి లో చేరి పోయాడు అన్న వార్తలను ప్రసారం చేయవద్దని, జనసేనకు లక్ష్మీ నారాయణకు మధ్య ఉన్న గ్యాప్ ఒక చిన్న ఫోన్ కాల్ తో పరిష్కారం అయి పోయేంత చిన్నదని, ఆయన అన్నారు. అయితే ఆయన నర్మగర్భంగా చెప్పిన వ్యాఖ్యల వెనుక సంగతి అప్పుడు అర్థం కాలేదు కానీ, ఇప్పుడు తెలుస్తున్న వివరాలను బట్టి, లక్ష్మీ నారాయణ పవన్ కళ్యాణ్ తో ను, జన సేన ప్రతినిధులతోను ఇది వరకే చర్చలు జరిపి ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో చర్చల సందర్భంగా లక్ష్మీ నారాయణ తన తో పాటు మరో ఐదుగురు పేర్లు పవన్ కళ్యాణ్ కి చెప్పాడట. ఈ ఐదుగురికి కూడా తనతో పాటు టికెట్ ఇవ్వాల్సిందిగా లక్ష్మీనారాయణ కోరాడట. దానికి పవన్ కళ్యాణ్, మీరు ఆ ఐదుగురికి సంబంధించిన వివరాలను సెంట్రల్ కమిటీ కి ఇచ్చినట్లయితే వారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని లక్ష్మీనారాయణ తో అన్నాడట. దీంతో లక్ష్మీనారాయణ నొచ్చుకున్నాడట. తాను అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే అయిదుగురి పేర్లను మీ దాకా తీసుకు వచ్చాను అని అన్నాడట. అయితే పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడిగా ఉన్న మరొక ఐఆర్ఎస్ అధికారి పార్థసారధి, ఆ ఐదుగురి పూర్తి వివరాలు లక్ష్మీనారాయణ ని కోరే సందర్భంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాస్త శృతి మంచి ఈ ఇద్దరు బ్యూరోక్రాట్ల మధ్య అగాధాన్ని సృష్టించిందిట. దాంతో అక్కడ నుండి లక్ష్మీనారాయణ వెళ్ళి పోయాడట. అయితే అలా వెళ్లి పోయిన తర్వాత జన సేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఆయనకు ఇప్పటి దాకా ఫోన్ ఏమీ రాలేదట.
మొత్తానికి ఇదీ జరిగిన సంగతి. ఒకవేళ పవన్ కళ్యాణ్ పూనుకుని, ఈ చిన్నపాటి ఈగో క్లాషెస్ ని సర్ది చెప్పినట్లయితే, అద్దేపల్లి శ్రీధర్ చెప్పినట్టుగా ఒక్క ఫోన్ కాల్ తో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. అలా పరిష్కారం అయిపోయిన మరుక్షణం ఆయన జనసేన లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఇంతకీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీలో మొదలవుతుంది అన్న సంగతి వేచి చూడాలి.