జనసేనకు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్ రాజురవితేజ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కొన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. అందులో ఒకటి పవన్ కల్యాణ్.. సమాజాన్ని కుల, మత పరంగా విభజిస్తున్నారని.. అది నచ్చలేదని.. ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుల, మత రాజకీయాలను అదే పద్దతిలో విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో మత మార్పిళ్ల అంశం ప్రధానమవుతోంది. వివిధ టీవీ చానళ్లతో.. రాజురవితేజ.. మాట్లాడిన మాటలను బట్టి చూస్తే… ఆయనకు మాతమార్పిళ్లను పవన్ కల్యాణ్ వ్యతిరేకించడం ఇష్టం లేదనే అభిప్రాయం కలగడం సహజం. ఈ మేరకు.. అసలు రాజురవితేజ ఎవరు..? ఆయన బిజినెస్ ఏంటి..? అన్న విషయాలను తెలుగు360 పరిశీలన చేసింది. ఇందులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
మత ప్రచార స్వచ్చంద సంస్థలు నడుపుతున్న రాజురవితేజ కుటుంబం..!
రాజురవితేజ క్లీన్ షేవ్‌తో జులపాల జుట్టుతో .. కాస్త మేధావి వర్గానికి చెందిన వ్యక్తిగా కనిపించడానకి ప్రాధాన్యం ఇస్తారు. ఓ రకంగా ఆయన విద్యాపరమైన మేధావి అయినా అయి ఉండాలి.. లేదా.. వ్యాపార రంగ ప్రముఖుడైనా అయి ఉండాలని అనుకుంటారు. కానీ రాజురవితేజ.. ఓ స్వచ్చంద సంస్థను నడుపుతూంటారు. దానిపేరు గుడ్ విల్ సొసైటీ. ఇది లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ. దీంట్లో ఉన్నపేరును బట్టి.. ఇది మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఈ స్వచ్చంద సంస్థ కార్యకలాపాలు దాదాపుగా లేవు. కానీ.. ఆయన స్వచ్చంద సంస్థ ఉన్న కార్యాలయం నంచి మరో సంస్థ “కార్ప్డైమ్ ఫౌండేషన్” అనే సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ కూడా.. స్వచ్చంద సంస్థ కేటగిరి కిందనే రిజిస్టర్ అయింది.. కానీ చేసేది మాత్రం మతమార్పిళ్లు. ఈ సంస్థ ఎవరిదో కాదు.. రాజురవితేజ సోదరుడు బచ్చల కుమారకృపకు చెందినది.
క్రిస్టియానిటీ విస్తరణ కోసం .. విదేశీ చర్చిల నుంచి రూ. లక్షల విరాళాలు..!
“కార్ప్డైమ్ ఫౌండేషన్”కు .. ప్రతీ ఏటా విదేశాల నుంచి లక్షల రూపాయల విరాళాలు వస్తున్నాయి. విదేశాల నుంచి అంటే.. వ్యక్తుల నుంచి కాదు.. చర్చిల నుంచి. విదేశాల్లో చర్చిల నుంచి “కార్ప్డైమ్ ఫౌండేషన్”కు లక్షలకు లక్షలు విరాళాలు వస్తున్నాయి. 2016లో అయితే ఇది కోటి దాటిపోయింది. 2018లో 39లక్షలుగా రికార్డులు చూపిస్తున్నాయి. ఈ విరాళాలు ఎక్కువగా.. నెదర్లాండ్స్‌లోని చర్చిల నుంచి వస్తున్నాయి. ఇలా ఆ చర్చిలు విరాళాలు ఎందుకు ఇస్తాయి..? మత ప్రచారం..మత మార్పిళ్లు చేయడానికే ఇస్తాయి. తాము అలా మత మార్పిళ్లు చేశామని… క్రిస్టియానిటీని పెంచామని.. ఆ సంస్థ… విరాళాలిచ్చిన చర్చిలకు నివేదికలివ్వాలి. ఈ మేరకు.. రాజురవితేజ సోదరుడు బచ్చల కుమారకృప ప్రత్యేకమైన నివేదికలు, పుస్తకాలను పబ్లిష్ చేశారు. అందులో.. హిందువుల్ని తాము ఎలా క్రిస్టియానిటీ వైపు మళ్లించామో.. ఫోటోలతో సహో కథలు..కథలుగా వర్ణించారు. కుమారకృప స్పియరో పబ్లికేషన్స్ పేరిట ఓ సంస్థను నడుపుతున్నారు. బైబిళ్లను ప్రింట్ చేసి.. మత ప్రచార కార్యక్రమాల స్టఫ్‌ను పంపిణీ చేయడమే ఈ పబ్లికేషన్స్ ప్రత్యేకత.
పక్కాగా నిబంధనల ఉల్లంఘన..! రాజురవితేజ పార్టీ మారడానికీ అదే కారణమా..?
విదేశాల నుంచి విరాళాలు పొందడానికి… స్వచ్చంద సంస్థలు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఎఫ్సీఆర్ఏ నిబంధనల ప్రకారం…విదేశీ విరాళాలు పొందే సంస్థలు ఎట్టి పరిస్థితులు.. మత ప్రచార కార్యక్రమాలు, మత మార్పిళ్లు చేయకూడదు. అలా చేయడం నేరం. కానీ.., రాజురవితేజ సోదరుడు.. కుమారకృప అదే పని చేస్తున్నారు. ఇలాంటి సంస్థలపై కేంద్రం.. ఇటీవల గట్టి నిఘా పెట్టింది. ఈ తరుణంలో రాజురవితేజ.. ఒక్క సారిగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేయడం… వైఎస్ జగన్‌ను పొగుడుతున్నట్లుగా మాట్లాడటం… అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో ఏదీ హఠాత్తుగా జరగదు. దానికో బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అదే ఇది కావొచ్చన్న అభిప్రాయం.. పలువురిలో ప్రారంభమవుతోంది.