ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర మొదలుపెడతానని ఆ మధ్య ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ యాత్ర నిర్వహిస్తానని చెప్పారు. దాంతో అప్పట్నుంచీ ‘అన్న వస్తున్నాడు’ అనే నినాదంతో వైకాపా శ్రేణులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర వాయిదా పడటం విశేషం! అక్టోబర్ 27 నుంచి మొదలు కావాల్సిన పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. నవంబర్ 1 లేదా 2 నుంచి పాదయాత్ర మొదలు కావొచ్చని కథనాలు వస్తున్నా.. పార్టీ తరఫు నుంచి స్పష్టత అయితే ఇంకా రాలేదు. తేదీని త్వరలోనే నిర్ణయించి చెబుతామనీ, ఇప్పుడు అనుకుంటున్న దానికి కాస్త అటుఇటుగా ఉంటుందని వైకాపా నాయకుడు పార్థ సారధి చెప్పారు. ఇంతకీ పాదయాత్ర ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చిదంటే… ముందుగా చేయాల్సిన పనులు, చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని చెబుతున్నారు.
ఆంధ్రాలో ఇంతవరకూ ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభం కాలేదు. చాన్నాళ్లుగా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తుల్లో ఇదీ ప్రాధానమైందే. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయనీ, పాదయాత్ర కంటే ముందుగానే వైకాపా కార్యాలయం ప్రారంభించాలని అనుకుంటున్నట్టుగా పార్థ సారధి చెప్పారు. ఆఫీస్ ఏర్పాట్లో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయనీ, త్వరలోనే పూర్తవుతాయనీ, ఆఫీస్ కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని ఈ సందర్భంగా విమర్శించారు. ఇక, పార్టీ వర్గాల్లోజరుగుతున్న చర్చ ఏంటంటే.. పాదయాత్ర కంటే ముందుగానే పార్టీలో చక్కదిద్దాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయట. యాత్రలో ఎలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలి, ఏయే అంశాలు ప్రస్థావించి ప్రజల్లోకి ప్రముఖంగా తీసుకెళ్లాలనేది ఇంకా స్పష్టత రాలేదని అంటున్నారు!
ఇక, బయట జరుగుతున్న ప్రచారం గురించి చెప్పాలంటే… అక్టోబర్ 27 శుక్రవారం రావడమే పాదయాత్ర వాయిదాకు కారణం అని కొంతమంది అంటున్నారు! ప్రతీ శుక్రవారం ఆయన కోర్టు హాజరు కావాలి కాబట్టి… ఆరోజు నుంచి మొదలుపెట్టడం సాధ్యం కాదు. అయితే, తేదీని ప్రకటించినప్పుడు ఈ విషయాన్ని జగన్ చూసుకోలేదా అనేది వైకాపా శ్రేణుల్లో కొంతమంది ప్రశ్న. దీంతోపాటు.. ఆరోజు ముహూర్తం బాలేదనీ, కొంతమంది జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం నవంబర్ 1 లేదా 2 తేదీలు మంచివని చెప్పినట్టు కూడా ప్రచారం సాగుతోంది. ఏదేమైనా, పార్టీకి ఎంతో కీలకమైన ఈ పాదయాత్ర విషయంలో ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండానే తేదీని ప్రకటించినట్టుగా కనిపిస్తోంది. కనీసం అక్టోబర్ 27 శుక్రవారం వస్తోందని కూడా చూసుకోకపోవడం గమనార్హం!