ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.. సైలెంట్‌గా ఉండిపోతున్నారు. లేదంటే ఓ ట్వీట్ పెట్టి.. ” ఏయ్” అని కీచుగొంతుతో అరుస్తున్నారు. వారి ఈ నిస్సహాయత వైసీపీ నేతల్ని మరింతగా ప్రోత్సహిస్తోంది. ఫలితంగా.. బీజేపీ నేతల్ని కుల, మత పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ తిట్టేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా పురందేశ్వరి విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ నిస్సహాయతను మరోసారి బయట పెట్టింది.
బీజేపీ నేతల్ని కించపర్చే హక్కు వైసీపీ నేతలకు ఇచ్చేశారా..!?
దగ్గుబాటి పురందేశ్వరిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అది వారి అంతర్గత వ్యవహారం. కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రన్నింగ్ కామెంటరీ ప్రారంభించారు. అమరావతి విషయంలో బీజేపీ విధానాన్ని పురందేశ్వరి.. తనకు పదవి వచ్చిన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పారు. అమరావతి రాజధాని అనేది బీజేపీ విధానం. అలాగే కేంద్రం జోక్యం చేసుకోబోదనేది కూడా బీజేపీ విధానం. ఇదే ఆమె చెప్పారు. కానీ ఆమెపై కుల ముద్ర వేస్తూ.. విజయసాయిరెడ్డి పేట్రేగిపోయారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శికి ఉండే స్థాయి వేరు. ఆమెపై విజయసాయిరెడ్డి చేసిన అభ్యంతరక వ్యాఖ్యలను బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. సునీల్ ధియోధర్ మాత్రం.. ఓ ట్వీట్ చేసి.. విజయసాయిరెడ్డి ఎక్కడ బాధపడతారో అన్నట్లుగా విమర్శలు గుప్పించారు.
వైసీపీకి వ్యతిరేకం అయితే కులం ముద్రే.. !
విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడని బీజేపీ నేతల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూంటారు. ఆయన గతంలో కన్నా లక్ష్మినారాయణపై అదే తరహా దాడి చేశారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో… జోక్యం చేసుకున్నారు. అదేదో తాను ఇచ్చినట్లుగా బీజేపీ పార్టీ ఫండ్‌ను కన్నా నొక్కేశారని కూడా చెప్పుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తనకు నచ్చని బీజేపీ నాయకులపై.. విజయసాయిరెడ్డి వేసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడూ కూడా వారికి సొంత పార్టీ నుంచి మద్దతు లభించలేదు. ఇప్పుడు.. పురందేశ్వరిని ఆయన టార్గెట్ చేశారు. అయినా స్పందన అంతంతమాత్రమే. బీజేపీ నేతల్ని ఇష్టమొచ్చినట్లుగా విమర్శించడం.. తనకు ఉన్న పేటెంట్గా భావిస్తూ విజయసాయిరెడ్డి చెలరేగిపోతున్నా.. బీజేపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
తమను తిట్టినా ముసిముసిగా నవ్వుకుంటున్న ప్రో వైసీపీ బ్యాచ్..!
బీజేపీలో వైసీపీ అభిమాన గ్రూపు ఇప్పుడు లీడింగ్‌లో ఉంది. వారిని కూడా వైసీపీ నేతలు వదలడం లేదు. సోము వీర్రాజును.. బీజేపీని కొడాలి నాని కించ పరిచినా… పట్టించుకున్న వారు లేరు. తనను స్వయంగా విమర్శించినా.. సోము వీర్రాజు స్పందించడానికి తటపటాయిస్తున్నారు. బీజేపీ నేతల ఈ బలహీనతను.. వైసీపీ పక్కాగా ఉపయోగించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా… స్పందించలేని దుస్థితికి బీజేపీ చేరిపోయిందని.. ఆ పార్టీకి తాము ఎంత చెబితే అంత… ఎవరైనా నోరెత్తితే.. తమ టంగ్ పవర్ రుచి చూడాల్సిందేననే సంకేతాల్ని పంపుతున్నారు.
వాళ్లు తిట్టినా పర్వాలేదు..మీడియా మాత్రం చెప్పకూడదట..!
కొసమెరుపేమిటంటే.. అత్తకొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా వైసీపీ నేతలు బీజేపీ నేతల్ని అత్యంత దారుణంగా కించ పరిచేలా మాట్లాడుతున్నా… అవన్నీ సర్టిఫికెట్లుగా భావిస్తున్న ఏపీ బీజేపీ నేతలు.. మీడియాలో మాత్రం వాటి గురించి చెబితే.. ఫీలైపోతున్నారు. అలా చెప్పిన వారందరిపై టీడీపీ ముద్ర వేసి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. బ్యాన్ చేస్తామనే హెచ్చరికల్ని పంపుతున్నారు. మరి ఆడలేక మద్దెలఓడు అంటే.. ఏమిటో ఏపీ బీజేపీ నేతలు ఇలా చూపిస్తున్నారన్న విమర్శలు రాకుండా ఉంటాయా..?