ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించినప్పటికీ, రెండు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెంచడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకు అటార్నీ జనరల్ ఒప్పుకోలేదని కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటోంది,” అని ఆరోపించారు.
కేంద్రం పట్ల ఆయన అసంతృప్తి, ఆగ్రహం, అసహనానికి అదీ ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. రాజధాని, పోలవరం, రాష్ట్రాభివృద్ధి విషయాలలో కేంద్రప్రభుత్వం సహాయం చేయకపోవడం, అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసులకి భయపడి కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగడం లేదని ప్రతిపక్షాల విమర్శలు, రాష్ట్ర ప్రభుత్వంపై అవి చేస్తున్న అవినీతి ఆరోపణల వలన తెదేపా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహించారు. అందుకు పరిష్కారంగా వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఆకర్షించడం ద్వారా ఆ పార్టీని బలహీనపరిచి తెదేపాకి ఎదురులేకుండా చేసుకోవాలనుకొన్నారు.
ఎలాగో కష్టపడి 20మంది వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో రప్పించగలిగారు కానీ వారి రాకతో పార్టీలో సిటింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. కనుక దీనికి ఏకైక పరిష్కార మార్గం రాష్ట్రంలో శాసనసభ స్థానాలని పెంచుకోవడమే. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అదే కోరుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలోగా రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు తప్పకుండా పెరుగుతాయని తెదేపా, తెరాసలలో సిటింగ్ ఎమ్మెల్యేలకి, బయట నుంచి పార్టీలో చేరుతున్న వారికీ కూడా చంద్రబాబు, కెసిఆర్ నచ్చజెప్పుకొని ప్రస్తుతానికి అందరినీ చల్లాబరిచారు. కానీ, 2026వరకు ఏ రాష్ట్రంలో కూడా శాసనసభ సీట్లు పెంచే ఆలోచన, ప్రయత్నాలు చేయమని కేంద్రప్రభుత్వం పార్లమెంటులో మొన్ననే మరొకమారు స్పష్టం చేసింది.
ఇది ముఖ్యమంత్రులు ఇద్దరికీ చాలా ఇబ్బంది కలిగించే సమాధానమే. తెలంగాణాలో కెసిఆర్ ని, తెరాసని ఎదుర్కోగల బలమైన ప్రతిపక్ష పార్టీ, నేతలు లేరు కనుక కెసిఆర్, అక్కడ పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్, తెదేపా నేతలు మళ్ళీ వెనక్కి వెళ్ళే ఆలోచన చేయకపోవచ్చు.
కానీ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబుని అడుగడుగునా చాలా బలంగా డ్డీ కొంటున్నారు. వైకాపా నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయినప్పటికీ ఆ పార్టీ చెక్కు చెదరలేదు పైగా ఇంకా బలంగా డ్డీ కొంటూ, రాష్ట్రంలో తెదేపాకి ఏకైక ప్రత్యామ్నాయంగా నిరూపించుకొంటోంది. ఈ పరిస్థితులలో శాసనసభ సీట్లు పెరుగవని స్పష్టం అయినందున, పార్టీలో సిటింగ్ ఎమ్మెల్యేలు, తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు కూడా చాలా ఆందోళన చెందడం సహజమే. అది శృతి మించితే, తెదేపాలో అసంతృప్తి, ఘర్షణలు ఆ కారణంగా వైకాపా ఎమ్మెల్యేలు మళ్ళీ స్వంత గూటికి తిరుగు ప్రయాణం ప్రారంభించవచ్చు. అదే జరిగితే, వారిని పార్టీలోకి రప్పించడం ద్వారా చంద్రబాబు ఆశించిన ప్రయోజనం నెరవేరదు పైగా బెడిసికొట్టినట్లవుతుంది. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చేసిన ఒక చిన్న ప్రకటనతో చంద్రబాబు ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయే ప్రమాదం ఏర్పడింది. కనుక ఆయన అసంతృప్తికి, అసహనానికి అదీ ఒక కారణం అయ్యుండవచ్చు.
కానీ ఇది చంద్రబాబు స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే, రెండు రాష్ట్రాలలో శాసనసభ సీట్లు పెంచుతామని ఏనాడూ కేంద్రప్రభుత్వం హామీ ఇవ్వలేదు. ఆ ప్రతిపాదనని కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలుచేయమని తెగేసి చెపుతున్న కేంద్రప్రభుత్వం, పరిశీలిస్తామని చెప్పిన మాటని అమలుచేస్తుందని అనుకోవడం, ఆ నమ్మకంతో ప్రత్యర్ధి పార్టీల ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహించడం, అందుకు ఇప్పుడు బాధపడటం కూడా అనవసరమే. ఈ వ్యవహారంలో కేంద్రాన్ని ఏమాత్రం తప్పు పట్టడానికి లేదు.కానీ చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి ఇదీ ఒక బలమైన కారణమేనని భావించవచ్చు.