మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం నుండి దాదాపు కోలుకున్నట్లే. పులి బయటకు వస్తుందని కేటీఆర్ గొప్పగా చెప్పుకున్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ కు రావటం, పార్టీ నేతలను కలుస్తుండటంతో అసెంబ్లీకి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు.
కానీ, బడ్జెట్ సమావేశాల ఫస్ట్ డేనే కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఎందుకు రాలేదని ఆరా తీయగా పార్టీ వర్గాలు ఓ లాజిక్ చెప్తుంటే, అసలు విషయం మాత్రం ఇంకొటి ఉన్నట్లు కనపడుతోంది.
పార్టీ వర్గాల ప్రకారం… అమావాస్య ముందుకు కేసీఆర్ బయటకు రారని, ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ ఇదే ఫాలో అవుతున్నారన్నది ఆఫ్ ది రికార్డుగా చెప్తున్న మాట.
కానీ, అసలు నిజం మరొకటి అనేది పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న చర్చ. సీఎంగా ఉన్నప్పటి నుండే కేసీఆర్ కు గవర్నర్ మధ్య అస్సలు పడేది కాదు. ఓడిపోయాక కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓడిపోయిన రోజు మర్యాదగా కూడా కేసీఆర్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం ఇవ్వలేదు. ఓఎస్డీ ద్వారా పంపారు… నిజానికి ఇది గవర్నర్ ను అవమానించటమే అని అప్పట్లో ప్రజాస్వామ్యవాదులు ఫైర్ అయ్యారు.
తాజాగా, గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ను వెల్ కమ్ చేసే సమయంలోనూ, స్పీచ్ ముందు కూడా ఎదురు పడాల్సి వస్తుంది. కానీ, అది కేసీఆర్ కు ఇష్టం లేదని అందుకే గవర్నర్ స్పీచ్ కు డుమ్మా కొట్టారని, గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేసీఆర్ దూరంగానే ఉంటారని తెలుస్తోంది. బడ్జెట్ పెట్టే రోజు మాత్రమే కేసీఆర్ సభకు హజరుకాబోతున్నారని సమాచారం.