ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో ఈ వారం.. రాజధాని అంశం వెనుక ఉన్న పూర్వాపరాలను.. విశ్లేషించారు. అంతిమంగా.. ఆయన ఏపీ సర్కార్.. రాజధాని కేంద్రంగా చేస్తున్న రాజకీయం వెనుక… సామాజికవర్గ కోణాన్నే ప్రధానంగా విశ్లేషించారు. సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ కులం మైకం కమ్మేసిన మేధావులు… నోరు మెదపడం లేదని… తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డికి.. అమరావతి అంటే.. కేవలం ఒక సామాజికవర్గమే కనిపిస్తోందని… అమరావతిలో ఏ అభివృద్ధి పని జరిగినా.. ఒక్క సామాజికవర్గమే లాభపడుతుందని.. భావిస్తున్నారని నిర్ధారించారు. ఇదే విషయాన్ని మోదీకి జగన్ ఫిర్యాదు కూడా చేశారని… 85 శాతం మంది ఒకే సామాజికవర్గానికి లాభం కలుగుతుందని… ప్రధానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆర్కే తేల్చారు.
రాజధానికి 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతుల్లో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి చెందినవారేనని.. ఆర్కే చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గంవారు ఎక్కువున్న గ్రామాల్లో భూములివ్వలేదని కూడా.. ఆర్కే “కొత్తపలుకు”లో గుర్తు చేశారు. అయితే.. రాజధానిని అలా కులం కోణంలో చూడటం కరెక్ట్ కాదని కూడా.. సోహోదారణంగా ఆర్కే వివరించారు. హైదరాబాద్ నిర్మితమప్పుడు ఎక్కువగా ముస్లింలే ఉన్నారని… ఇప్పుడు హైదరాబాద్ అందరిదని గుర్తు చేశారు. హైదరాబాద్లో ఉత్తరాది, దక్షిణాది వారికి ఆస్తులు ఉన్నాయన్నారు. సీఎం హోదాలో ఉన్న జగన్ కులకోణంలో ఆలోచించడమేంటని.. ఆర్కే ఆశ్యర్యపోయారు కానీ… ప్రజలందరికీ ఆ ఆశ్చర్యం ఉంది.
ఏపీ ప్రజల తెలివి తక్కువ తనాన్ని.. ఆర్కే “కొత్తపలుకు”లో కొత్త తరహాగా బయట పెట్టారు. తాము తెలివిగలవాళ్లమని అందరితో అనిపించకుంటూ… తెలంగాణ వారి కన్నా… తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారని తన విశ్లే్షణతో చెప్పకనే చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో అన్ని వర్గాలు ఒకే స్వరం వినిపించాయని.. కానీ రాజధాని కూడా లేని ఏపీలో మాత్రం ఇప్పటికీ భిన్నస్వరాలున్నాయని ఉదాహరణగా చెప్పారు ఆర్కే. భారీవర్షాలు కురిస్తే మహానగరాల్లో జనజీవనం అస్తవ్యస్తం అవుతుందని.. అంత మాత్రాన.. రాజధానిని మార్చేస్తారా.. ఆని ప్రశ్నించారు. ఏదోఒక సామాజికవర్గంపై సీఎం స్థాయి వ్యక్తికి కోపం తగదని.. అలా చేయడం.. రాష్ట్రానికి తీరని ద్రోహమని ఆర్కే తేల్చేశారు.