అనూహ్యంగా యూటర్న్ తీసుకుని రాజకీయ పార్టీ ప్రకటించే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న రజనీకాంత్, తమిళనాడులో హాట్ టాపిక్ గా మారారు. అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యుల విముఖత కారణంగా రజనీకాంత్ రాజకీయాల నుంచి ఆరంగేట్రం చేయకముందే వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, అనధికార కారణాలు వేరే ఉన్నట్లుగా తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
దశాబ్దాల పాటు ఊరించి చివరికి చేతులెత్తేసిన రజిని:
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాట రజనీకాంత్ ని ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరిగిన విషయం ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోయినప్పటికీ, రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ దాన్ని గుర్తుంచుకుంటారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ పతనావస్థలో ఉన్న కారణంగా ఇటు రజిని, అటు చిరంజీవి ఇద్దరు కూడా పివి నరసింహారావు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత చిరంజీవి అనువు గాని సమయంలో రాజకీయాల్లోకి వచ్చి విఫలమైతే, రజనీకాంత్ ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ దశాబ్దాల పాటు కాలం వెళ్లదీసి చివరికి చేతులెత్తేశారు.
అధికార కారణాలు వేరు – అనధికార కారణాలు వేరు:
అయితే జయలలిత మరణాంతరం మళ్లీ రాజకీయ ప్రవేశం పట్ల అభిమానుల్లో ఆశలు రేకెత్తించిన రజనీకాంత్ చివరికి అనారోగ్య కారణాలతో రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అధికారికంగా కారణాలు ఇలా ఉన్నప్పటికీ, అనధికారికంగా ఇతర అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రజనీ స్వయంగా చేయించుకున్న సర్వేల లో తీవ్ర ప్రతికూల ఫలితాలు రావడం, బిజెపికి మద్దతుగా నిలవడానికి అభిమానులు ఒప్పుకోకపోవడం, వంద రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించడానికి ఆరోగ్యం సహకరించకపోవడం, నిధుల లేమి వంటి అనేక కారణాల వల్లే రజినీకాంత్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్వయంగా చేయించుకున్న సర్వేల్లో తీవ్ర నిరాశాజనక ఫలితాలు:
అన్నింటికంటే ప్రధానమైన కారణం, ఇటీవల రజనీకాంత్ కొన్ని సంస్థల చేత చేయించుకున్న సర్వేలలో తీవ్ర నిరాశ కలిగించే ఫలితాలు రావడమే అని తెలుస్తోంది. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి 17 శాతం ఓట్లు, 18 సీట్లు వస్తే, పవన్ కళ్యాణ్ సమయానికి సినీతారల పట్ల క్రేజ్ మరింతగా తగ్గి ఏడు శాతం ఓట్లు ఒక సీటు మాత్రమే వచ్చింది. అటు తమిళనాట కమల్ హాసన్ విజయ్ కాంత్ వంటి సినీ తారల కి కూడా అంత కంటే ఘోరమైన ఫలితాలు ఇటీవలి కాలంలో వచ్చాయి
ఈ నేపథ్యంలో రజనీ పార్టీకి ఫలితాలు భిన్నంగా ఉంటాయని ఎవరు భావించడం లేదు. రజినీకాంత్ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలలో కూడా ఇదే తేలినట్లుగా తెలుస్తోంది. 234 స్థానాల్లో కేవలం 10-15 స్థానాల్లో మాత్రమే రజినీకాంత్ ఎంతో కొంత ప్రభావం చూపగలడని, రజినీకాంత్ స్థాపించే పార్టీ 1-2 స్థానాల్లో గెలవడం కూడా కష్టమే అని, తాను స్వయంగా గెలవడమూ అనుమానమే అని సర్వే లో తేలడమే రజనీ యూ టర్న్ కి ప్రధాన కారణం అనే వాదన తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది.
స్టెర్లైట్ పరిశ్రమ సమస్య సమయంలో, పలు ఇతర సమస్యల సమయంలో ప్రజల పక్షాన కాకుండా అధికార పార్టీల పక్షాన నిలబడటం రజనీ ఇమేజ్ ని దారుణం గా దెబ్బతీసింది. బీజేపీకి వంత పాడటం తనను మరింత చులకన చేసింది. ఇక ఆధ్యాత్మిక రాజకీయాలు చేస్తాను అన్న వ్యాఖ్యలు కూడా తమిళ నాట కామెడీ మీమ్స్ కి కారణం అయ్యాయి. పైగా వయసు, బలం ఉండి ప్రజలకు సేవ చేయగలిగిన సమయంలో కాకుండా వయసు అయిపోయి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాక రాజకీయాల్లోకిి రావడం పట్ల కూడా తమిళ ప్రజల్లో వ్యతిరేకత కనిస్తోంది. గత ఏడాది పెరియార్ కు వ్యతిరేకంగా రజనీ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన మీద ప్రజలు దుమ్మెత్తిపోసిన తీరు చూశాక, సినిమా స్టార్ డం వేరు రాజకీయ నాయకత్వం వేరు అని రజనీకాంత్ కి కూడా అర్థమై ఉండవచ్చు.
మొత్తం మీద:
రజినీకాంత్ కి ఆరోగ్య సమస్యలు లేవు అని కాదు. కానీ సర్వేలలో అనుకూల ఫలితాలు వచ్చి ఉండి, పార్టీ నిలబడుతుందనే నమ్మకం ఉంటే ఆరోగ్యాన్ని పక్కనపెట్టి మరీ ( లేదా అందుకు తగ్గ పూర్తి ఏర్పాట్లు చేసుకుని) రాజకీయాల్లోకి బలంగా వచ్చి ఉండేవారు రజనీ. కానీ, ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయని పలు సర్వేల ద్వారా స్పష్టంగా అర్థమవుతూనే ఉండడంతో, అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ముందుకు రావడంతో, అనారోగ్య సమస్యలు కారణంగా చూపి రజినీకాంత్ రాజకీయాల నుండి “సేఫ్ ఎగ్జిట్ ” తీసుకున్నాడు అని చెప్పవచ్చు. అయితే రాజకీయాలను పూర్తిగా పక్కన పెడతారా లేక ఎన్నికలకు ముందు మళ్ళీ తెరమీదకు వచ్చి మోడీకి మద్దతు ఇస్తారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.