ఏపీ సీఎం చంద్రబాబుతో జరిగే భేటీలో ఏడు మండలాల కోసం పట్టుబట్టాలని .. ముందుగా ఆ అంశం తేల్చిన తర్వాతనే ఇతర అంశాల జోలికి వెళ్లాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే రేవంత్ మాత్రం ఐదు గ్రామాలను ఖచ్చితంగా తెలంగాణకు ఇవ్వాలని పట్టుబట్టనున్నారు. ఇదే అంశాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పెట్టారు.
భద్రాచలం సమీపంలో ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ను ప్రభుత్వం చేయబోతోంది. పోలవరం కోసం ఏపీలో ఏడు మండలాలు కలపాల్సి వచ్చినప్పుడు భద్రాచలం ఆలయ ప్రాంతాన్ని తెలంగాణకు వదిలేసి, మిగతా మండలం మొత్తం ఆంధ్రాకు అని చట్టం చేశారు. అంటే భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో ఉంది. పక్కనే ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి కేటాయించారు.
ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగం. గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుంది. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ పని చేయాలంటే ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని అంటున్నారు. ఆ ఐదు గ్రామాల ప్రజలు కూడా తాము తెలంగాణలోనే ఉంటామని వైసీపీ హయాంలో ఉద్యమాలు చేశారు. ఇప్పుడేమంటారో మరి !