అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య కొంచెం సయోధ్య ఏర్పడినట్లే కనబడుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడి కూడా వారిరువు సఖ్యతగా ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని అందుకు కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు ఆయన స్వయంగా ఇరువురు ముఖ్యమంత్రులతో కలిసి ప్రజలకు అభివాదం చేసారు. చంద్రబాబు నాయుడు కూడా మొదటి నుండి తెరాస ప్రభుత్వంతో సఖ్యతనే కోరుకొంటున్న సంగతి అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇరువురు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుతూనే ఉన్నారు. మరో పదేళ్ళ దాక హైదరాబాద్ ని వదలనని చెప్పిన చంద్రబాబు నాయుడు, కారణాలు ఎవయితేనేమి, హైదరాబాద్ వదిలిపెట్టేశారు. అంతేకాదు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏర్పడిన సయోద్యను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళడం మానుకొన్నారు. కేసీఆర్ తన ఫార్మ్ హౌస్ లో త్వరలో నిర్వహించబోయే చండీయాగానికి చంద్రబాబు నాయుడు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే కేసీఆర్ తో సయోధ్య కోసం చంద్రబాబు, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని స్పష్టం అవుతోంది.
ఒకవేళ తెదేపా, తెరాస, బీజేపీలు మూడు చేతులు కలిపినట్లయితే అందరి కంటే ఎక్కువగా నష్టపోయేది ఎవరు అని ఆలోచిస్తే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయేనని చెప్పవచ్చును. నిజంగా అదే జరిగినట్లయితే తెలంగాణాలో ఇక తెరాసాకు ఎదురు ఉండదు. అలాగే ఆంధ్రాలో తెదేపా-బీజేపీలు మరింత బలపడతాయి. ఇంతవరకు బీజేపీతో తెదేపా తెగతెంపులు చేసుకొంటే దాని స్థానంలోకి ప్రవేశించాలని జగన్మోహన్ రెడ్డి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే మాట నిన్న వెంకయ్య నాయుడు కూడా అన్నారు. కానీ ఇప్పుడు తెదేపా, బీజేపీలతో తెరాస చెయ్యి కలిపేందుకు సిద్దపడితే ఇక కాంగ్రెస్, వైకాపాలు ఒంటరి పోరాటానికయినా సిద్దం కావాలి లేదా ఆ రెండు పార్టీలు చేతులు కలపాల్సి ఉంటుంది. బహుశః ఈ కారణంతోనే వైకాపా వరంగల్ ఉప ఎన్నికలలో పోటీకి దిగినట్లుంది.
ఒకవేళ తెరాస తేదేపాకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్లయితే, అప్పుడు తెలంగాణాలో తమ పార్టీ మళ్ళీ ఏక్టివ్ అవుతుందని కేసీఆర్ కు సూచించడానికే జగన్ ఈ ఉప ఎన్నికలలో తమకు బలం లేదని తెలిసి కూడా పోటీ చేయిస్తున్నారు..తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారని భావించవచ్చును. అంతే కాదు ఈ ఉప ఎన్నికలలో తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించడం ద్వారా త్వరలో జరుగనున్న జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో జంట నగరాలలో నివసిస్తున్న ఆంధ్రా ఓటర్లను వైకాపా వైపు ఆకర్షించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని జగన్ భావిస్తుండవచ్చును.