వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ… ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగించాలన్న పట్టుదలను.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నారు. మూడు రోజుల క్రితమే అర్థాంతరంగా.. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ.. ఇచ్చిన జీవోను ఉపసంహరించుకున్న ఏపీసర్కార్.. కొత్తగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్రజాప్రతినిధుల అనర్హత చట్ట సవరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి.. లాభదాయక పదవుల పరిధిలోకి రాదని చట్టంలో మార్పులు తెస్తూ.. ఆర్డినెన్స్ జారీ చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి… ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో జారీ చేసిన జీవోలో.. నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
అయితే హఠాత్తుగా పదమూడు రోజుల తర్వాత నియామకాన్ని రద్దు చేస్తూ.. జీవోను వెనక్కి తీసుకున్నారు. దీనికి కారణం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద .. విజయసాయిరెడ్డిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనర్హతా వేటుకు గురవుతారన్న న్యాయనిపుణులు హెచ్చరించడంతో.. ఉన్న పళంగా.. ఆయన నియామకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు.. ఆయనే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉండాలని.. జగన్ భావిస్తూండటంతో.. ఏకంగా చట్ట సవరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముందుా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. చట్ట సవరణ ఆర్డినెన్స్‌తో విజయసాయిరెడ్డికి లైన్ క్లియర్ అవుతుంది. విజయసాయిరెడ్డిని మళ్లీ ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా.. సర్కార్ మరో జీవో జారీ చేయనుంది.
ప్రభుత్వ ప్రయత్నాలను.. టీడీపీ సీనియర్ నేత యనల రామకృష్ణుడు తప్పు పట్టారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందన్నారు. తప్పుడు జీవోతో విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియనించారని .. తీరా గుట్టు రట్టు కావడంతో నాలుక కరుచుకుని జీవో రద్దు చేశారన్నారు. 13 రోజులపాటు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పదవిలో ఉన్న… విజయసాయి రెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ దొడ్డిదారిన విజయసాయిరెడ్డిని… ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు ఇంకో ఎత్తుగడ వేశారని.. తన కేసుల లాబీయింగ్ కోసమే పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి పదవి వ్యవహారం.. ముందు ముందు రాజకీయ దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.