ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తరలించబోతున్నారనే ఈ చర్చ.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతోంది. అమరావతిలో ఎక్కడి పనులు అక్కడ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు… ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని.. చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీళ్లన్నింటినీ బిగపట్టి ఒక్కసారిగా వదిలి.. రాజధాని గ్రామాల్లోకి నీరు వచ్చేలా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఎంత చేసినా నీళ్లు రాలేదు.. మునిగిపోయిందనే ప్రచారం మాత్రం ప్రారంభించారు.
ముంపు ముప్పే లేదని ఎన్జీటీ సర్టిఫికెట్ ఇచ్చిందిగా..!
వరదల కారణంగా రాజధానిలోని ఒక్క గ్రామంలోకి కూడా నీరు రాలేదు. గతంలో ఎగువ భాగాన వర్షాలు కురిస్తే కొండవీటివాగు పొంగి నీరుకొండ, ఎర్రబాలెం, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, తదితర ప్రాంతాల్లో భూములు నీట మునిగేవి. కానీ.. ఏపీ సర్కార్ కొండవీటివాగు ముంపు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి పూర్తి చేసింది. ముంపు ముప్పు తప్పిపోవడంతో.. రాజధాని నిర్మాణానికి ముందుకెళ్లొచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపింది. మొన్నటి వరదల్లో కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కి ఎగువ భాగాన 8 లక్షల 29 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇంత వరద నీరొచ్చినా కూడా రాజధానిలో ఏ ఒక్క గ్రామానికి ముంపు సమస్య ఏర్పడలేదు.
రూ. 37వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేయలేరు..!
రాజధానిలో సుమారు రూ. 37వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపట్టారు. రహదారుల నిర్మాణం 65 శాతం మేర పూర్తయ్యాయి. సీడ్ యాక్సిస్ రహదారి కూడా తుది దశకు చేరుకుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాల్గో తరగతి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసన మండలి వంటి పలు కీలక నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక సచివాలయం టవర్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలు, గవర్నర్ బంగ్లా వంటి నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ దశలో రాజధానిపై పునరాలోచన అనేది.. ప్రకటన చేసినంత తేలిక కాదు.
మారిస్తే రైతులిచ్చిన భూముల సంగతేం చేస్తారు..!?
రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాలిచ్చారు. వారికి ఇచ్చిన ప్లాట్లను ఇప్పటికే ఏపీ సీఆర్డీఏ రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. లాటరీ విధానంలో రైతులకు వేరే భూముల్లో ప్లాట్లు వచ్చాయి. కొంతమంది రైతులు వాటిని విక్రయించారు. ఈ దశలో రాజధానిని మార్చాలన్నా కూడా సాధ్యం కాదని న్యాయనిపుణలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కౌలు చెల్లించడం లేదు. కానీ రైతులు ఇంకా న్యాయపోరాటం దిశగా ఆలోచించలేదు. సహనంతో ఉన్నారు. ప్రభుత్వం కౌలు ఇవ్వబోమని ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే..వారు కోర్టుకెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి అమరావతిని దొనకొండకో.. ఇంకో చోటకో మార్చాలన్నా… అది సాధ్యమయ్యే పని కాదని మాత్రం.. నిపుణలు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ ఇలా గందరగోళం సృష్టించి.. అమరావతిని ఓ మృతనగరంగా మార్చడాన్ని మాత్రం.. విజయవంతంగా పూర్తి చేయవచ్చంటున్నారు.