కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించి, భంగపడ్డవారు తీవ్రమైన అసంత్రుప్తికి గురౌతున్న సంగతి తెలిసిందే. ఆ సెగలు గాంధీభవన్ వరకూ చేరుకున్నాయి కూడా. అయితే, ఇప్పుడా రెబెల్స్ అంతా పార్టీ కూటమిగా ఏర్పడతామంటూ ప్రకటించడం కొంత ఆసక్తికరంగా ఉంది. యునైటెడ్ రెబెల్స్ ఫ్రెంట్ పేరుతో తామంతా కలిసికట్టుగా పోటీకి దిగుతామంటున్నారు. బోడ జనార్థన్ నేతృత్వంలో వీరంతా ఒకటిగా సాగుతారట! సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొంతమంది కాంగ్రెస్ రెబెల్ నేతలు మీడియాతో సమావేశమయ్యారు. దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి, చిత్తశుద్ధితో సేవలు చేస్తున్నవారికి టిక్కెట్లు దక్కకపోవడం దారుణమంటూ జనార్థన్ ఆరోపించారు. ఒక నెల ముందు పార్టీలో చేరినవారికీ, మూడు సార్లు ఓడిపోయినవారికి టిక్కెట్లు ఇచ్చారన్నారు.
విజయరామారావు మాట్లాడుతూ… తనకు ఇష్టం వచ్చినవారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్లు ఇప్పించుకున్నారనీ, సీట్లు అమ్ముకున్నట్టు కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యతను ఉత్తమ్ ఒక్కరే తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, బ్యాంకు దోపిడీలు చేసినవారు, రియల్ ఎస్టేట్ అక్రమ దందాలు చేస్తున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు. తమకు న్యాయం జరగకపోతే ఏకంగా 40 సీట్లలో బరిలోకి దిగుతామని విజయరామారావు కాంగ్రెస్ ని హెచ్చరించారు.
ఇంతకీ ఈ రెబెల్స్ ఫ్రెంట్ నిజంగానే పోటీకి దిగుతుందా..? ఇప్పుడు వీరంతా చెబుతున్నట్టుగా ఒకే గుర్తుపై పోటీ చేయడం సాధ్యమౌతుందా..? ఈ ప్రశ్నలకు వారి దగ్గరే సరైన సమాధానాలు లేని పరిస్థితి. నలభైమంది రెబెల్స్ ఐక్యంగా ఉన్నామనీ, పోటీ చేస్తామని గొప్పగా చెప్పారు. కానీ, ప్రెస్ మీట్ కి అందరూ ఎందుకు రాలేదు..? ఒకవేళ వచ్చి ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ పై ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇంకోటి, వీరందరూ స్వతంత్రులుగా బరిలోకి దిగితే, ఒకే గుర్తుపై పోటీ ఎలా సాధ్యం? అది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం కదా! కేవలం కాంగ్రెస్ పార్టీని బెదిరించడం కోసం చేసే ఒక ప్రయత్నం మాత్రమే ఈ విలేకరుల సమావేశమనీ, ఈ రెబెల్స్ కూటమిలో అంత చిత్తశుద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతలు కొంతమంది కొట్టిపడేస్తున్నారు.
అయితే, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక.. కాంగ్రెస్ జాబితాలోని నేర చరితుల వివరాలను బహిర్గతం చేస్తామనీ, కొంతమంది అభ్యర్థులపై ఉన్న కేసులు, వారి అక్రమ వ్యాపార లావాదేవీలు ప్రజలకు వివరిస్తామని విజయరామారావు అన్నారు. మరి, ఇవి కూడా కేవలం బెదిరింపు వ్యాఖ్యలా, నిజంగానే వారి దగ్గర అలాంటి సమాచారం ఏదైనా ఉందా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాలి.