మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎంతో కొంత అసంతృప్తి కొందరిలో వ్యక్తం కావడం సహజమే గాని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నంత తీవ్రత గతంలో ఉండేది కాదు. పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా తెలుగుదేశంలో అంతర్గత పరిస్థితి సరిగ్గా లేదనీ, అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటే శాసనంగా చలామణి అయ్యే దశ మారిందని స్పష్టమై పోయింది. దీర్ఘకాలంగా ఆయనకు సన్నిహితంగా వుంటూ అనేక ఆశలు పెంచుకున్న వారే ఇప్పుడు ఆగ్రహావేదనలకు గురి కావడం ఆసక్తికరం. వయసు రీత్యా గాని ఆరోగ్య పరంగా గాని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారు గనక ఇది పెద్ద సమస్య కాదని అధికార ప్రతినిధులు చెబుతుంటే ఆ కుమారుడే అసంతృప్తిగా మాట్లాడ్డం మరో విశేషం. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం కూడా అలాటిదే. ఇక విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఎ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి పిలిచి బుజ్జగించిన తర్వాత కూడా నిష్ఘూరంగానే మాట్లాడుతున్నారు. తమ జిల్లా మంత్రులనే పరోక్షంగా సన్నాసులు అని ఒకటికి రెండు సార్లు తీసిపారేశారు. రాజమండ్రి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధాన కార్యదర్శి పదవికిరాజీనామా చేయడం ఇంకా ఆశ్యర్యకరం.నిజానికి బుచ్చయ్య చౌదరి,బోండా ఉమల పేర్లు ఎప్పుడూ పరిశీలనలో లేవు.ప్రచారానికీ రాలేదు.అయినా వారు లోలోపల ఆశలు పెంచుకుని నిరుత్సాహానికి గురయ్యారన్నమాట.ఈ స్థాయిలో కాకున్నా రావెల కిశోర్‌బాబు స్వరంలోనూ సణుగుడు వుంది. ఇక జలీల్ ఖాన్ విషయంలోనూ ఊరించి ఉస్సూరనిపించినట్టే. ఇద్దరు మహిళలను తొలగించి ఒక కొత్తమ్మాయిని తీసుకున్నంత మాత్రాన మహిళా ప్రాతినిధ్యం సరిపోదు కూడా. వీరే గాక మరో ముగ్గురు నలుగురు ఎంఎల్ఎలు కూడా బహిరంగంగానే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తిరుగులేని పరిస్థితిలో వుందనుకుంటే వారింతగా బయిటపడే వారు కాదు. లోలోపల కుతకుత వుడుకుతున్న అసంతృప్తి కొంతమంది చుట్టూనే కథ తిరుగుతుందనే ఆగ్రహం ఈ పరిణామానికి దారితీశాయి.ఇక ఫిరాయింపుదారులకు సగం పదవులు ఇవ్వడంపై అందరిలోనూ తీవ్రమైన కోపం వుంది. ఈ స్తితిలో చంద్రబాబు ఎలా సర్దుబాటు చేసినా లోలోపల వారి అసంతృప్తి రగులుతూనే వుంటుందన్నది స్పష్టం.