రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ తయారీ కార్యక్రమాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సొంత నియోజక వర్గం గజ్వేల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆరోగ్య సూచి ఉందనీ, మన దగ్గర కూడా అలాంటిది రావాలన్నారు. దాని వల్ల ప్రజలకు సత్వరం చికిత్స అందే సదుపాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమం ముందుగా గజ్వేల్ నుంచి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత, రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ తయారీ ఉంటుందని చెప్పారు. ఇదే సభలో… ఎక్స్ రే ఆఫ్ గజ్వేల్ ని సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నియోజక వర్గ పరిధిలో ప్రజలందరి వివరాలతోపాటు, అవసరాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు అన్నీ ఆ ఎక్సరేలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంట్రామిరెడ్డికి అప్పగిస్తూ… ఆయన్నే ఇక్కడి ఎమ్మెల్యేగా భావించాలనీ, ఆయన సూచించే పనుల్ని మంత్రులు చేయాలని చమత్కరించారు.
గజ్వేల్ లో చేసుకోవడానికి పనిలేదు అనే పరిస్థితి ఉండొదన్నారు. అందరికీ ఉపాధి ఉండాలన్నారు. దాని కోసం అవసరమైన కార్యాచరణ చెప్తాననీ, పార్టీలకు అతీతంగా అందరి నాయకులతో కలిసి త్వరలోనే సమావేశం పెట్టుకుందామనీ, ఒక రోజంతా తాను ఉంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రతీ ఇంటికీ పాడి పశులు ఇవ్వాలనీ, ఇల్లులేని నిరుపేద అనేవాడు నియోజక వర్గంలోనే ఉండొద్దు అనేదీ… ఇలా ఎన్నికల సందర్భంగా మన సంకల్పాన్ని ప్రజలకు చెప్పామన్నారు. అయితే, ఈ సంవత్సరం గడచిపోతోందనీ… దేశంలో ఆర్థిక మాంద్య పరిస్థితులున్నాయన్నారు. అదే మనల్ని కూడా పట్టి పీడిస్తోందన్నారు.
కేసీఆర్ ప్రకటించిన ఆరోగ్య సూచి మంచి ఆలోచనే. ఇది ఆచరణలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే, కొన్ని హామీల అమలు కాకపోవడానికి ఆర్థిమాంద్యం అడ్డు రావడమే కారణమన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. మాంద్యం అనేది ఈ మధ్య వినిపిస్తున్న మాట. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది కదా. డబుల్ బెడ్ రూం ఇళ్లు, పాడి పశువుల పంపిణీ లాంటివి గత టెర్మ్ లో ప్రకటించిన పథకాలే కదా! ఇవి పూర్తికాకపోవడానికి కూడా దేశంలో మాంద్యం కారణంగా చూపించడమే విడ్డూరంగా ఉంది. వాస్తవం మాట్లాడుకుంటే… ఇచ్చిన హామీల అమలు చేయలేని వైఫల్యాన్ని మాంద్యం మీదికి నెట్టేస్తున్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఏవైనా పనులు పూర్తవలేదంటే… కేంద్రం నిర్లక్ష్యం, దేశంలో మాంద్యం అనే కారణాలను బాగానే పట్టుకున్నారు! పదేపదే వీటికి ప్రాచుర్యం కల్పించే పని మొదలైంది అనిపిస్తోంది.