హైదరాబాద్: వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా మంటపంలో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్స్‌లను అడ్డుకున్నందుకు పోలీసులను గ్రామస్తులు చితకబాదిన ఘటన ప్రకాశంజిల్లాలో చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకాలపల్లెపాలెం గ్రామంలో వినాయకచవితి మంటపంలో రికార్డింగ్ డాన్స్‌లు జరుగుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అశ్లీల నృత్యాలను వెంటనే ఆపేయాలని ఆదేశించారు. అయితే నృత్యాలను జోరుగా ఎంజాయ్ చేస్తున్న గ్రామస్తులకు పోలీసులు పానకంలో పుడకలా, పంటికింద రాయిలా కనిపించారేమో వారిపై దాడికి దిగారు. ఎస్ఐ రమణయ్యకు, పోలీస్ జీప్ డ్రైవర్ ఉపేంద్రకు గాయాలయ్యాయి. పోలీస్ జీప్ ధ్వంసమయింది. ఇది తెలుసుకున్న డీఎస్పీ అదనపు బలగాలతో ఈ తెల్లవారుఝామున గ్రామానికి చేరుకుని పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 144వ సెక్షన్ విధించారు.