హైదరాబాద్: వరదలతో కుదేలైన చెన్నై నగరానికి కార్పొరేటే సంస్థలు, బ్యాంక్‌లు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. అయితే ఐటీ సంస్థ కాగ్నిజెంట్ మాత్రం ఈ విరాళాలలో రికార్డ్ సృష్టించింది. ఏకంగా 40 మిలియన్ అమెరికన్ డాలర్లు(రు.260 కోట్లు)ను విరాళంగా ప్రకటించింది. ఇందులో రు.65 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి, స్వచ్ఛంద సంస్థలు, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇతర సంస్థలకు అందజేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరో రు.195 కోట్లను చెన్నైలోని తమ కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో పని చేస్తూ, వరద ముంపునకు గురైన ఉద్యోగులు, వ్యాపార భాగస్వాముల తక్షణ, దీర్ఘకాలిక అవసరాలు తీర్చేందుకు కేటాయించనుంది. చెన్నై పునర్నిర్మాణంలో కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే విరాళాలు కీలక పాత్ర పోషిస్తాయని కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ గార్డన్ కోబర్న్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. తమ కంపెనీకి చెందిన వేలాది మందికి చెన్నై సొంతిల్లు లాంటిదని, వీరికి సాయం చేయటంతోపాటు నగరాన్ని పునర్నిర్మించటంలో ముందుంటామని తెలిపారు. కాగ్నిజెంట్‌కు చెన్నైలో 60 వేలమంది ఉద్యోగులు, 11 కార్యాలయాలు ఉన్నాయి. మరోవైపు టీవీఎస్ మోటార్స్, ఇండియా సిమెంట్స్, హ్యూండాయ్ మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ కలిపి మొత్తంగా రు.22 కోట్ల విరాళాలు ప్రకటించాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. చెన్నై వరద బాధితుల కోసం ముందుగా స్పందించి భూరి విరాళం ప్రకటించి, కాగ్నిజెంట్ ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి.