రికార్డులు శాశ్వతం కాదు. అవెప్పుడూ బ్రేక్ అవుతూనే ఉంటాయి. కాకపోతే.. రికార్డు సృష్టించడానీ, దాన్ని బ్రేక్ చేయడానికీ పెద్ద గ్యాప్ ఉండడం లేదు. ఓ స్టార్ హీరో ఓ రికార్డ్ క్రియేట్ చేస్తే, ఆ వెంటనే వచ్చిన మరో స్టార్ హీరో సినిమా ఆ రికార్డ్ ని బ్రేక్ చేయడం పరిపాటిగా మారింది. అయితే.. ఆడియో రైట్స్ విషయంలో ‘పుష్ప 2’ రికార్డ్ ఎవ్వరూ బ్రేక్ చేయలేరేమో అనిపిస్తోంది.
‘పుష్ప 2 ‘ఆడియో రైట్స్ ని టీ సిరీస్ సంస్థ ఏకంగా రూ.65 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడియో రైట్స్ విషయంలో ఇదే ఆల్ ఇండియా రికార్డ్! నిజానికి ఆడియో రైట్స్ ఇది వరకటంత జోరుగా లేదు. దాని వాల్యూ తగ్గిపోతున్న దశలో.. మళ్లీ ఆడియోరైట్స్కి రెక్కలొచ్చాయి. మా మాదిరి సినిమాకి సైతం కోట్లలో బిజినెస్ జరుగుతోంది. స్టార్ హీరో సినిమా అంటే మినిమం రూ.10 నుంచి రూ.20 కోట్లు పలుకుతున్నాయి. ‘పుష్ప 2’ మాత్రం ఏకంగా రూ.65 కోట్లు తెచ్చుకొంది. ‘పుష్ప 1’లో పాటలు నేషనల్ వైడ్ గా హిట్టయ్యాయి. కాబట్టి.. టీ సిరీస్ పార్ట్ 2 హక్కులపై భారీగా వచ్చించింది. సలార్ ఆడియో రైట్స్ సైతం టీ సిరీస్ దక్కించుకొంది. ఆడియో రైట్స్ రూపంలో రూ.28 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. పుష్ప తో పోలిస్తే.. చాలా తక్కువ.
సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్లది మ్యూజికల్ హిట్ కాంబో! వాళ్ల ఆడియో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. `సలార్` అలా కాదు. ఇదో యాక్షన్ డ్రామా. ఇందులో పాటలకు పెద్దగా స్కోప్లేదు. కేజీఎఫ్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకొంటారు తప్ప, పాటలు అంతగా గుర్తుండవు. ప్రశాంత్ నీల్ విజువల్స్,ఎమోషన్, హీరోయిజం… వీటిపై ఎక్కువగా ఫోకస్ పెడతాడు. అది ఆయన స్టైల్. కాబట్టి.. ఆడియో పరంగా ఈ సినిమాకి పెద్దగా క్రేజ్ లేదు. అందుకే రూ.28 కోట్లకు అమ్ముడుపోయింది. ఈలోగా.. పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించే క్రేజీ సినిమా ఏదీ లేదు. కాబట్టి.. పుష్ప 2 రికార్డ్ కొన్నాళ్ల పాటు సేఫ్.