ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్తబ్దత నెలకొందని ప్రచారం జరుగుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ప్రధాన సూత్రధారి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టును విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి సిద్దం అవుతోన్న పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. విదేశాల్లో ఉన్న ఆయనను అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ దర్యాప్తు టీం దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అని, అందుకే ఈ కేసులో ఆయనను ఏ-1గా చేర్చామని కోర్టుకు దర్యాప్తు టీం నివేదించింది. కోర్టు పర్మిషన్ ఇస్తే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు ఇచ్చిన స్టేట్ మెంట్ లను సేకరించిన పోలీసులు… ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరోసటి రోజు ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళారు.
ప్రభాకర్ రావు అమెరికాలోని టెక్సాస్ లో ఉన్నట్లుగా మీడియాకు సమాచారం అందించిన పోలీసులు ఆయనను హైదరాబాద్ కు రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన మొదట్లో త్వరలోనే హైదరాబాద్ వస్తానని చెప్పినా ఆయన ఎందుకో సడెన్ గా ఆగిపోయారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా విదేశాల నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు కోర్టు అనుమతి కోరారు. కోర్టు రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు అనుమతి ఇస్తుందా..? ఇవ్వకపోతే తదుపరి ఎం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు.