ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టార్ ప్లేయర్ గా ప్రభుత్వం భావిస్తున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావుకు అతి కష్టం మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించగలిగారు. ఆయనతో పాటు శ్రవణ్ రావుపైనా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈయన ఐ న్యూస్ ఓవర్. ఐ న్యూస్ ఆఫీసులోనే ఓ సర్వర్ పెట్టుకుని మరీ ట్యాపింగ్ చేయించారని పోలీసులు కేసులు పెట్టారు.
ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి ముందు చికిత్స పేరుతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. కేసు నమోదైన తర్వాత శ్రవణ్ రావు పరారయ్యారు. మొదట్లో ప్రభాకర్ రావు పోలీసులకు టచ్ లో ఉన్నారు. ఆరు నెలల్లో వస్తానని చెప్పారు కానీ తర్వాత డబ్బులు కట్టి గ్రీన్ కార్డు తీసుకుని అక్కడే ఉండిపోయారు. కానీ భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండటంతో రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అక్కడ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవచ్చు. బలవంతంగా ఇండియాకు డిపోర్టు చేయవచ్చు.
అందు కోసమే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అయితే వీరు అక్కడి కోర్టులను ఆశ్రయిస్తే.. తమను రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని నమ్మించగలిగితే కోర్టులు డిపోర్టేషన్ ను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. వీరు తప్పులు చేశారని .. వీరిపై కేసులు రాజకీయ ప్రేరేపితం కాదని భావిస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వీరిద్దరూ వస్తే.. ఇరవై నాలుగుగంటల్లో బీఆర్ఎస్ పెద్దల్ని అరెస్టు చేస్తామని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారు.