సర్జికల్ దాడుల తరువాత భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత రోజురోజుకీ పెరుగుతోందే తప్ప, తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ దాడులకు పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని మాత్రం తెలుస్తూనే ఉంది. అయితే, ఆ ప్రతీకారం ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ రేపుతోంది. దీనిపై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. మరోసారి భారత పార్లమెంటు మీదికి ఉగ్రదాడులు ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్టు ఓ మూడు రోజుల కిందట కథనాలు వచ్చాయి. ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతాల్లో మానవ బాంబుల దాడికి కుట్ర జరుగుతోందన్న సమాచారం అందినట్టు కూడా చెప్పారు. ఇంకోపక్క… సరిహద్దు ప్రాంతంలో ఉన్న గ్రామాలను పాకిస్థాన్ కూడా ఖాళీ చేయించింది. ఈ నేపథ్యంలో పాక్ నుంచి ఏదో ఒక చర్య ఉంటుందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి. ఈ ఊహాగానాలను ఊతమిచ్చేలా తాజాగా పాక్ సరిహద్దుల్లో ఎర్ర జెండాలు కనిపించాయి. పాక్ సైన్యమే ఆ జెండాలను ఎగరేసిందని అంటున్నారు! పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టులపై ఎర్ర జెండాలు ఎగరడం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులకు తెగబడతాం అని పాక్ సైన్యం సంకేతాలు ఇస్తున్నట్టుగా జెండాలు పెట్టారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఈ జెండాలు కనిపించడంతో భారత్ సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులో పహారా మరింత చెప్పారు. సైనికులకు వారాంతపు సెలవులు రద్దుచేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోందనే చెప్పాలి.
నిజానికి, సర్జికల్ దాడుల తరువాత పాక్ ప్రతీకారం ఉంటుందని భారత్ ముందునుంచీ ఊహిస్తూనే వస్తోంది. అప్రమత్తంగానే ఉంటోంది. ఆ అప్రమత్తను భగ్నం చేస్తూ భారత్ దృష్టిని మళ్లించేందుకు పాక్ రకరకాల కథనాలు ప్రచారంలోకి తెచ్చిందని భారత విదేశాంగ శాఖ సందేహిస్తూనే ఉంది. పాకిస్థాన్‌లో ఆర్మీ తిరుగుబాటు ఉంటుందని డాన్ పత్రిక ఈ మధ్య ఓ కథనం ప్రచురించింది. ఉగ్రవాద సంస్థలపై యుద్ధం చేయాలని షరీఫ్ ఆర్మీ నిర్ణయించిందని కూడా మరో కథనం పాక్‌లో చక్కర్లు కొట్టింది. ఐ.ఎస్.ఐ. చీఫ్‌ను మార్చాలనుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ భారత్‌ను తప్పుతోవ పట్టించేందుకు పాక్ వండివార్చుతున్న కథనాలుగా మన విదేశాంగ శాఖ చెబుతూనే ఉంది. భారత్ దృష్టిని ఇలాంటి అంశాలవైపు మళ్లించి… సరిహద్దుల్లో భారీగా సైనిక మోహరింపులకు పాక్ పాల్పడుతోందన్నది ఓ అంచనా. అది నిజమే అయి ఉంటుందన్న ఊహగానాలకు బలం చేకూర్చుతూ ఎర్ర జెండాలు ఎగురుతున్నాయి. మొత్తానికి సరిహద్దుల్లో పరిస్థితిపై మరోసారి దేశవ్యాప్తంగా ఉత్కంఠ మొదలైందనే చెప్పాలి.