రీమేక్ సినిమాల వల్ల.. ఎన్ని సౌలభ్యాలున్నాయో… అన్నే అనర్థాలూ ఉన్నాయి. కథపై ప్రేక్షకులకు ఓ అవగాహన ఉంటుంది. కొన్ని ఊహించుకుని థియేటర్ కి వస్తాడు. వాటికంటే ఓ మెట్టు పైనే.. సినిమా తీయాలి. ట్విస్టులూ, టర్న్‌లూ ఉన్న సినిమాని రీమేక్ చేయడం ఇంకా కష్టం. ఆ ట్విస్ట్ థియేటర్ కి వచ్చే ముందే ప్రేక్షకుడికి తెలిసిపోయే అవకాశం (ప్రమాదం) ఉంది. కథలో జిస్ట్ ముందే అర్థమైపోతే.. కిక్ ఉండదు. తమిళ సినిమా `తడమ్`… కి ప్రాణం.. అందులో ఉన్న ట్విస్టులే. దాన్ని ఇప్పుడు `రెడ్`గా తీసుకొచ్చారు. ఇస్మార్ట్ శంకర్ తరవాత.. రామ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో `రెడ్` పై మరింతగా దృష్టి పడింది. మరి… `తడమ్` రీమేక్ తెలుగులో ఎలా తీశారు? `తడమ్`ని ట్విస్టులూ టర్న్‌లూ.. కాపాడినట్టు.. రెడ్నీ ఆదుకున్నాయా?
కథ టూకీగా చెప్పుకుంటే.. ఒకేలా ఉండే ఇద్దరి కథ ఇది. ఒకరు ఆదిత్య (రామ్) తనో దొంగ. పేకాట రాయుడు. డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు.. సడన్ గా ఓరోజు ఆదిత్యకు రూ.8 లక్షలు అవసరం ఏర్పడుతుంది. అదే రోజు… ఓ మర్డర్ జరుగుతుంది. అంతే కాదు 11 లక్షలు మిస్ అవుతాయి. ఆ కేసులో… ప్రధాన నిందితుడిగా రామ్ ని అనుమానిస్తుంటారు పోలీసులు. అయితే ఇదే కేసులో ఆల్రెడీ సిద్దార్థ్ (రామ్) అరెస్ట్ అవుతాడు. సిద్దార్థ్, ఆదిత్య ఒకేలా ఉంటారు. మరి ఈ ఇద్దరిలో ఒకరు హత్య చేయడం అయితే గ్యారెంటీ. మరి ఆ హత్య ఎవరు చేశారు? అసలు ఆదిత్య, సిద్దార్థ్ ఇద్దరూ ఎవరు? ఒకరికొకరు ఏమవుతారు? అన్నదే కథ.
తమిళ `తడమ్` పెద్ద హిట్టేం కాదు. `మంచి సినిమా` అనిపించుకుంది. అందులో పాయింట్ కొత్తగా ఉండడంతో రీమేక్ కి ఎంచుకున్నారు. బేసిక్ ఫ్లాట్ ని మార్చడానికి దర్శకుడు ఏమాత్రం సాహసం చేయలేదు. `తడమ్`కి ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ అయ్యిందో, దాన్ని మార్చకూడదు అనుకోవడం మంచి నిర్ణయమే. కానీ.. దాని చుట్టూ పేర్చిన అదనపు హంగులు.. అసలు పాయింట్ పై ప్రభావం చూపిస్తేనే ప్రమాదం ఏర్పడుతుంది. తడమ్… రెడ్ గా మారే క్రమంలో అదే జరిగింది. తడమ్ లో అరుణ్ విజయ్ నటించాడు. తనకు అక్కడ అంతగా ఇమేజ్ లేదు. కానీ.. ఇక్కడ రామ్. అసలే ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ లో ఉన్నాడు.కాబట్టి తన కోసం మార్పులూ, చేర్పులూ, మసాలా గీతాలూ అవసరం అయ్యాయి. వాటిని పేర్చుకుంటూ వెళ్లే క్రమంలో… అనవసరమైన స్టఫ్‌కి చోటిచ్చేశారు. దాంతో ఫస్టాఫ్ అంతా… ఉపయోగం లేని సన్నివేశాలతో భర్తీ చేయాల్సివచ్చింది. పాటలు, అనవసరమైన ఎలివేషన్లూ.. ఇచ్చుకుంటూ పోయారు. ఆ క్రమంలో అసలు కథ… ద్వితీయార్థంలో గానీ మొదలు కాదు.
థ్రిల్లర్ జోనర్లో సినిమా అనగానే.. అది పరుగులు పెడుతూ ఉండాలి. హీరోయిజం కోసమో, మాస్ కోసమో, ఫ్యాన్స్ కోసమో… సన్నివేశాలు అల్లేయకూడదు. `రెడ్` విషయంలో అదే జరిగింది. `తడమ్`లో మదర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అది ఇక్కడ కనిపించలేదు. క్లైమాక్స్ కూడా అక్కడ సింపుల్ గా తేల్చేస్తే… ఇక్కడ ఇద్దరు రామ్ ల మధ్య సీన్లు లాగ్ చేసి… సెంటిమెంట్ జొప్పించి, ఓ పాట ఇరికించి, మరింత నీరసం తెప్పించారు. ప్రధమార్థంతో పోలిస్తే… ద్వితీయార్థం బాగుంది. మర్డర్ కి సంబంధించిన ఒక్కో క్లూ.. బయటకు రావడం, అది తేలిపోవడం, ఆ వెంటనే మరో క్లూ.. దొరకడం.. ఇలా గ్రిప్పింగ్‌గానే సాగింది. ఈ కథలో కనిపించే ఆ ఇద్దరూ.. నిజంగా ఇద్దరా? ఒక్కరా? అనే అనుమానం రావడం.. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు సర్ప్రైజ్ అవ్వడం `రెడ్`లో కనిపించలేదు. నిజానికి ఇదేం పెద్ద పాయింట్ కాదేమో అని దర్శకుడు భావించి ఉంటాడు. కాబట్టి.. ఆ ట్విస్ట్ ని దాచి పెట్టేందుకు ప్రయత్నించలేదు. థ్రిల్లర్ చిత్రాలకు ముగింపు చాలా కీలకం. దాన్ని ఆసక్తికరంగా మలచలేకపోవడం మరో ప్రధానమైన లోపం.
రామ్‌లో ఎనర్జీ గురించి కొత్తగా చెప్పేదేమెంది? అసలే ఇస్మార్ట్ ఊపులో ఉన్నాడు. అదే ఈజ్, అదే ఫైర్ ఇక్కడా కనిపిస్తుంది. అయితే రెండు పాత్రల మధ్య మరీ ఎక్కువ వేరియేషన్స్ చూపించలేదు. జస్ట్.. డ్రస్సులు, డైలాగ్ డెలివరీ మార్చాడు. ఓ మాస్పాటలో… తనదైన స్టైల్ లో స్టెప్పులు వేసి అలరించాడు. నివేదా పేతురాజ్ నటన ఆకట్టుకుంటుంది. పోలీస్ పాత్రలో సిన్సియారిటీ చూపించింది. మాళవిక, అమృత అయ్యర్ ఓకే అనిపిస్తారు. సంపత్, సత్య… ఇలా ఎవరి పాత్రల్లో వాళ్లు రాణించారు.
తక్కువ బడ్జెట్ లో ఈ సినిమా పూర్తి చేయాలని స్రవంతి మూవీస్ భావించి ఉంటుంది. అందుకే… వీలైనంత పొదుపు సూత్రాలు పాటించి ఈ సినిమా తీసి ఉంటుంది. క్వాటిలీలో ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంటుంది. కథలో భారీ మార్పులేం చేయకపోయినా, దాన్ని నడిపించే కథనం విషయంలో మాత్రం దర్శకుడు అనవసరమైన హంగులకు చోటిచ్చాడు. ఆ చేర్పులు ఆకట్టుకునేలా ఉండి ఉంటే బాగుండేది. మణిశర్మ పాటల్లో `డించక్..` మాస్ కి ఊపు తెస్తుంది. నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించగలిగాడు.
పాయింట్ ని చూసి టెమ్ట్ అయి, రీమేక్‌లకు సిద్ధ పడడం తప్పు కాదు. కానీ ఆ పాయింట్ చుట్టూ ఎలాంటి అంశాల్ని పేర్చుకోవాలి? ఆ పాయింట్ ని ఇంకాస్త కొత్తగా ఎలా ఆవిష్కరించాలి? అనే విషయాలు దర్శకుడు పట్టించుకోవాలి. ఆ తూకంలో తేడా వస్తే.. `రెడ్` జోన్లో పడినట్టే.
రేటింగ్: 2.5