రామ్ ఎంత మాసో.. ఇస్మార్ట్ శంకర్ తో తేలిపోయింది. ఇప్పుడొస్తున్న `రెడ్` అందుకేం మినహాయింపు కాదన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సినిమా ఇది. కిషోర్ గత చిత్రాలన్నీ సాఫ్ట్ గా ఉంటాయి. అయితే ఈసారి తాను రామ్ దారిలోకి వెళ్లి `రెడ్` తీశాడు. ఇదో థ్రిల్లర్. రామ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రపై మరొకరు… ఆధిపత్యం చూపించుకోవడమే ఈ `రెడ్ `స్పెషాలిటీ.
ఓ మంచి సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ, ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని – లైఫ్లో అంతా సాఫ్ట్ గానే అయిపోతుందనుకున్న ఒకరి జీవితంలోకి, అచ్చంగా అలానే ఉన్న మరో క్రిమినల్ ప్రవేశిస్తే ఏం జరుగుతుందన్నది కథ. ఇంటర్ కూడా పాసవ్వని ఓ తెలివైన క్రిమినల్ గా రామ్ కనిపించనున్నాడు. ఆ పాత్రే.. ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందన్న విషయం ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది. రామ్ గెటప్, లుక్స్, డైలాగ్ డెలివరీ… ఇవన్నీ మాస్ కి నచ్చేలా ఉన్నాయి. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలానే పేర్చుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మణిశర్మ ఆర్.ఆర్.. ఈ సినిమాని మరో స్థాయిలో తీసుకెళ్తుందన్న నమ్మకం కలిగిస్తోంది. సంక్రాంతి బరిలో.. `రెడ్` నిలిచింది. మాస్కి.. పసందైన విందు దొరకడం ఖాయం.