చంద్రబాబు హయాంలో శేషాచలం కొండల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపారు. ఓ సందర్భంలో స్మగ్లర్లను ఎన్ కౌంటర్ కూడా చేశారు. అప్పట్లో దుంగల దొంగల్ని ఎడా పెడా పట్టేసుకున్నారు. ఐజీ స్థాయి అధికారితో భద్రత బలగాన్ని ఏర్పాటు చేశారు. అడవుల్లో సైతం సీసీ కెమెరాలు పెట్టారు. కానీ ఇప్పుడేమయింది ? దొంగ చేతికి రాజ్యం వెళ్లింది.. స్మగ్లర్ల ఇష్టారాజ్యం అయింది. స్మగ్లర్లు.. వారి ముసుగు నేతలు వేల కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారు.
గత ఐదేళ్లలో ఎర్రచందనం స్మగ్లర్లపై తూతూ మంత్రం దాడులు
శేషాచలం కొండల్లో విచ్చలవిడిగా ఎర్రచందనం కొట్టివేత జరుగుతోంది.ఎంత దారుణం అంటే.. తిరుమల కొండల మీద కూడా ఇలా ఎర్రచందనం కొట్టేసి తీసుకెళ్తూ అలిపిరి దగ్గర పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తో ఆ పట్టుబడిన ఘటనలు ఉన్నాయేమో కానీ అత్యధికం తరలిపోయాయి. గతంలో తమిళనాడు నుంచి కూలీల్ని రప్పించి.. కొట్టిచేవారు. కానీ గత ఐదేళ్లుగా అది వ్యవస్థీకృతం అయింది. కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన బడా స్మగ్లింగ్ నేతలే.. ముఠాల్ని నడుపుతూ వేల కోట్లు ఆర్జించారు.
ఆ నేతలు అంత అర్థిక సామర్థ్యం ఎక్కడిది ?
తిరుపతిని ఆనుకుని ఉండే ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ఆర్థిక సామర్థ్యం చాలా తక్కువ. కొన్ని వాటర్ ట్యాంకర్లు.. కొన్ని లారీలు తప్ప ఆయనకు పెద్దగా వ్యాపారాలు లేవు. వేసవి కాలం వస్తే తిరుమల కొండలకు నిప్పు పెట్టేసి.. ఆర్పేందుకు వాటర్ ట్యాంకర్లు పంపి సొమ్ము చేసుకుంటారన్న పేరు ఉంది. ఆయన గత ఐదేళ్లుగా ఊహించనంతగా ఖర్చు పెట్టారు. ఓటర్లకు విచ్చలవిడిగా తాయిలాలు పెట్టారు. తన బాస్ రాజకీయ అవసరాలకు ప్రతి రూపాయి ఆయనే ఖర్చు పెడతారు. చివరికి పొరుగు రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయనే ప్రధాన ఫైనాన్షియర్‌గా మారారు. ఇప్పుడు ఆయనతో పాటు కుమారుడు రంగంలోకి దిగుతున్నాడు. రెండు జిల్లాల ఖర్చులన్నీ తాను పెట్టుకుంటానని ఆయన భరోసా ఇచ్చి ఎంపీ టిక్కెట్ పొందాడు. ఆయనకు వస్తున్న సొమ్మంతా ఎర్రచందనం స్మగ్లింగేనని బహిరంగ రహస్యం.
చిత్తూరు వైసీపీ అభ్యర్థి కరుడు గట్టిన ఎర్రచందనం స్మగ్లర్
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గంగిరెడ్డి అనే ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ ను విదేశాల నుంచి అరెస్టు చేసితీసుకు వచ్చారు. జగన్ రెడ్డి వచ్చాక ఆయన బయటకు వచ్చి పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నారు. కానీ తన వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ తరపున రాజకీయంగా కీలక పదవులు పొందుతున్నారు. చిత్తూరు జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యే .. బలిజ వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసుల్ని తప్పించి.. ఎర్రచందనం స్మగ్లర్ అయిన విజయానందరెడ్డి జగన్ రెడ్డి టిక్కెట్ ఇచ్చారంటే ఆ అనుబంధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అడవల్ని కొల్లగొట్టాడనికి పూర్తి సాయం
ప్రభుత్వంలో ఉన్న వారు ప్రకృతి సంపదను.. ప్రభుత్వ సంపదను కాపాడాలి. కానీ జగన్ రెడ్డి సర్కార్ లో అంతా దోపిడీ మయమే. ఉత్తుత్తి సెక్యూరిటీని పెట్టి.. ఎవరెవరు ఎంత కావాలంటే అంత కొట్టుకెళ్లిపోయే చాన్సిచ్చారు. ఈ ధైర్యంతోనే కానిస్టేబుల్ కూడా హత్య చేశారు. ఇలాంటి అరాచకాలు ఎన్ని చేసినా స్మగ్లర్లకు ఉన్నంత రక్షణ పోలీసులకు ఉండదు.