దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు.. పర్చూరులో వైసీపీ నేతలు… రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు. ఆయన రాక తమకు సంతోషం కాదని.. బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. దగ్గుబాటిని పార్టీలోకి చేర్చుకోవడానికి వీలు లేదంటూ నియోజకవర్గంలోని 6మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు పర్చూరు లోని రోటరి భవన్ లో సమావేశం అయ్యారు. దగ్గుబాటి హితేష్ రామ్ కు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. తమపై కేసులు పెట్టి వేధించారని.. ఇప్పుడు ఆయనకే తాము ఎలా మద్దతివ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఆరు మండలాల నుంచి పార్టీకి చెందిన అన్ని వ్యవస్థల నేతలు… సమావేశానికి హాజరై.. దగ్గుబాటికి వ్యతిరేకంగా.. తీర్మానం చేశారు.
గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన.. గొట్టిపాటి భరత్.. ఈ సారి తను పోటీ చేయలేనని తప్పుకున్నారు. ఆయన సోదరుడు.. గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరిపోయారు. ఈ కారణంగా.. జగన్ ఇప్పటి వరకు.. ఇద్దరు, ముగ్గురు ఇన్చార్జిలను మార్చారు. ఏడాది క్రితం.. రామనాథం బాబు అనే నేతను నియమించారు. ఆయన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఎదుర్కోవడానికి.. చాలా ఖర్చు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ లో కాస్త పట్టు సాధించారు. ఈ క్రమంలో.. దగ్గుబాటి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని హితేష్ రామ్ కు టిక్కెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించడంతోనే వివాదం తలెత్తింది.
నిజానికి దగ్గబాటి వెంకటేశ్వరారవు.. ఆరు నెలలుగా.. వైసీపీలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతర్గతంగా ప్రజాభిప్రాయసేకరణ జరుపుకున్నారు. పర్చూరులో గతంలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకున్నారు. అందరూ కలసి వస్తారని ఆశించి.. వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. కానీ చివరికి వైసీపీ శ్రేణులు అడ్డం తిరిగాయి. ఇప్పుడు వారిని బజ్జగించడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలా ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది.