కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏపీలో లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. అయితే.. ఓ మౌలికమైన ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు. కేంద్రం జిల్లాల వారీగా రెడ్ జోన్లను ప్రకటించింది.కానీ ఏపీ సర్కార్ మొదటి నుంచి మండలాల వారీగా జోన్లను విశ్లేషిస్తోంది. ప్రస్తుతం 63 మాత్రమే రెడ్ జోన్లో, 54 మండలాలు ఆరెంజ్ జోన్లో, మిగిలిన 573 మండలాలు గ్రీన్ జోన్ లో కొనసాగుతున్నాయి. అంటే…రెడ్జోన్లలో మాత్రమే ఆంక్షలు విధిస్తారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే నాలుగో తేదీ నుంచి మద్యం అమ్మకాలు ఉంటాయన్న సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు బయటకు పంపాయి. భౌతిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిపేలా ఏర్పాట్లు చేయనున్నారు.
లాక్డౌన్ పూర్తయ్యే వరకూ బార్లకు మాత్రం అనుమతి ఇవ్వరు. అయితే ఇక్కడా జోన్ల విషయంలో దేన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటే ఐదు జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నందున అక్కడ అమ్మకాలు జరగవు. మండలాలను యూనిట్‌గా తీసుకుంటే అన్ని జిల్లాల్లోనూ రెడ్ జోన్ మండలాలను మినహాయించి మిగిలిన మండలాల్లో మద్యం విక్రయించే అవకాశముంది. ప్రభుత్వం మొదటి నుంచి మండలాలనే ప్రొజెక్ట్ చేస్తోంది కాబట్టి.. మండలాలనే యూనిట్‌గా ప్రకటించి జోన్లను ఖరారు చేయనుంది.
అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్.. మూడో తేదీతో ముగుస్తుందని అనుకోవచ్చు. దాదాపుగా అన్ని రకాల కార్యకలాపాలు…నాలుగో తేదీ నుంచి ఏపీలో ప్రారంభం కానున్నాయి. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్లలో మాత్రం.. పటిష్టంగా నిబంధనలు అమలు చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడమే కాదు.. రైతులు కూడా తమ పంటల్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలకు జిల్లాలు మూసివేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కలు అన్ని జిల్లాలోనూ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.