ఏపీ మంత్రివర్గంలోకి కొత్తగా నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఆరు నెలల పనితీరును అంచనా వేసిన చంద్రబాబు ఒకరిద్దర్ని మార్చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా మారుస్తారు అని ప్రచారంలోకి వచ్చిన వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కడప జిల్లాకు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డిదే. ఆయన కడప వంటి జిల్లాకు మంత్రిగా వ్యవహరిస్తున్నా వివాదాస్పదం అయ్యారు కానీ ఎక్కడా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేయలేకపోయారు. పైగా ఆయనపై అంతర్గతంగా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.
అదే సమయంలో కడప జిల్లా నుంచి డైనమిక్ లీడర్ గా రెడ్డప్పగారి మాధవీరెడ్డి ఎప్పుడూ హైలెట్ అవుతున్నారు. ఆమె వైసీపీ నేతలపై పోరాడుతున్న విధానం అందర్నీ ఆకర్షిస్తోంది. కడప జిల్లా మంత్రిగా ఆమెకు చాన్స్ ఇస్తే వైసీపీ ని తుడిచి పెట్టేస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికి అసాధ్యం అనుకున్న కడప అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించారు. ముస్లిం మహిళలందర్నీ తన వైపునకు తిప్పుకున్నారు. ఆమె నాయకత్వ లక్షణాలు కడప టీడీపీకి ఎంతో మేలు చేస్తాయని భావిస్తున్నారు.
రాంప్రసాద్ రెడ్డిని మార్చాలని చంద్రబాబు అనుకుంటే మాధవీరెడ్డితో పాటు పరిశీలనలోకి వచ్చే మరో పేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిది. అయితే ఆయన ఉమ్మడి జిల్లాల ప్రకారం చూసుకుంటే చిత్తూరు జిల్లాకు చెందిన వారవుతారు. అందుకే మాధవీరెడ్డికి ప్లస్ పాయింట్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాంప్రసాద్ రెడ్డికి ఆరు నెలలు చాన్స్ ఇచ్చినా ప్రయోజనం లేదు కాబట్టి మాధవీరెడ్డికి ఇచ్చి చూడాలనేవారు ఎక్కువ మందిఉన్నారు.