నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో పెరుగుతోంది. మూడు రోజుల కిందట మహాసేన రాజేష్ ఈ డిమాండ్ చేశారు. తాజాగా పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు ఎదుటే ఈ ప్రతిపాదన చేశారు. ఇంత హఠాత్తుగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎందుకు టీడీపీ నేతలు పట్టుబడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
లోకేష్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కన్నా ఎక్కువ పవర్ చూపిస్తున్నారు. ఆయనకు ప్రభుత్వంపై, పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు ఉంది. అత్యధిక కీలక నిర్ణయాలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెబుతున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం నినాదం వస్తోందనేది ఆసక్తికరం. లోకేష్ పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే పెట్టుబడులన్నీ లోకేష్ ప్రణాళికతోనే వస్తున్నాయి. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఢిల్లీ రాజకీయాల్లోనూ తన ఉనికిని ఘనంగా చాటారు. ప్రధాని మోదీ కూడా ఆత్మీయత చూపుతున్నారు.
చంద్రబాబు వారసుడు లోకేషేనని స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేలా ఇప్పటి నుండే నిర్ణయాలు తీసుకుంటే మంచిదన్న వాదనల కారణంగానే టీడీపీలో ఈ డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది తెలియదు కానీ ముందు ముందు ఈ డిప్యూటీ సీఎం నినాదం బలంగా వినిపించే అవకాశం ఉంది.