టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజే.. అభ్యర్థుల్ని ప్రకటించడం సంచలనంగా మారింది. సిట్టింగులందరికీ టిక్కెట్లు ఇచ్చారు. సిట్టింగ్లు లేని చోట.. కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ మొత్తం అంశంలో…సామాజికన్యాయం జరిగిందా.. అన్న చర్చ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. రాజకీయాల్లో సామాజికవర్గం అనేది చాలా పెద్ద అంశం. ముందుగా సామాజికవర్గం చూసిన తర్వాతే… ఇతర అంశాలను చూసి టిక్కెట్ ఖరారు చేస్తారు. ఈ సామాజిక సమీకరణాలు.. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రం మొత్తం మ్యాచ్ కావాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తమ సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని కొన్ని వర్గాల నుంచి ఇబ్బందులొస్తాయి.
మరి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో అలాంటి కసరత్తు జరిగిందా..? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రకటించిన 105 నియోజకవర్గాల్లో 33 మంది రెడ్డి సామాజికవర్గం నేతలు టిక్కెట్లు పొందారు. మిగిలిన పధ్నాలుగు నియోజకవర్గాల్లో కూడా… రిజర్వేషన్ మినహా.. ఇతర నియోజకవర్గాల్లోనూ… టిక్కెట్ కోసం పోటీ పడేవారిలో రెడ్డి నేతలున్నారు. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రభావవంతమైనది. ఆ వర్గం.. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి ఆ వర్గం నేతలే టిక్కెట్ల కోసం పోరాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటారు. అయితే టిక్కెట్ల విషయంలో.. టీఆర్ఎస్ అదినేత ఇచ్చినన్ని సీట్లు ఇస్తారో లేదో అంచనా వేయలేం. ఆ పార్టీ..అన్ని రకాల సామాజిక సమీకరణాలను చూసుకునే టిక్కెట్లు ఖరారు చేస్తుంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు.. కమ్మ, వెలమ సామాజికవర్గాలకూ ప్రాధాన్యం దక్కింది. కమ్మ సామాజికవర్గం నుంచి ఆరుగురు, వెలమ సామాజికవర్గం నుంచి దాదాపుగా ఎనిమిది మంది వరకూ అవకాశం దక్కించుకున్నారు.
వీరందరికీ పోను.. . బీసీ వర్గాలకు దక్కింది పరిమితమే. ఈ బీసీ వర్గాల్లోనూ మున్నూరు కాపు వర్గానికి ప్రాధాన్యం లభించింది. మిగతా పధ్నాలుగు సీట్ల కోసం అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత… మొత్తం సామాజిక సమీకరణాలపై విశ్లేషణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే ఆసలు సామాజిక న్యాయం రాజకీయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇతర పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఇది మరింత ఎక్కువ కానుంది. అయితే కేసీఆర్ టిక్కెట్ల కేటాయింపులు.. సిట్టింగ్ల అనే సమీకరణం నుంచే సాగింది. అందుకే ఆయన సామాజిక సమీకరణాల లెక్కలను తీసుకోలేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.