వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత … జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగంపై కులం ముద్ర వేసే ప్రయత్నం చేశారు. పోలీసుల్లో అందరూ కమ్మ వాళ్లున్నారని… అధారాలు లేని ఆరోపణలు చేశారు. పోలీసుల్ని రాజకీయం కోసం వాడుకున్నారు. పోలీసులు అధికారిక డాటా రిలీజ్ చేస్తే.. ప్రమోషన్ పొందిన వారిలో ఇద్దరు మాత్రమే కమ్మవాళ్లుంటే.. ఆరుగురు రెడ్లు ఉన్న విషయం వెల్లడయింది. అయినా సరే వారికి కావాల్సిన ” సామాజిక న్యాయ” రాజకీయం వారు చేసుకున్నారు. అన్నీ తెలిసి సాక్షిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి జగన్ చేస్తున్న సామాజిక న్యాయం ఎలాంటింది..? . “గురివింద” తన నలుపు చూసుకోదంటారు. జగన్ కూడా అదే టైపు. ఆయన తన నలుపు ఎప్పుడూ చూసుకోరు.
వైసీపీలో ఓపెన్ కేటగిరి “రెడ్ల”కు రిజర్వ్ చేసేశారా..?
- వైసీపీ అధ్యక్షుడు రెడ్డి..!
- నిన్నామొన్నటి వరకు ఏడుగురు లోక్ సభ ఎంపీలు ఉంటే ఆరుగురు రెడ్డి..!
- రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉంటే ఇద్దరూ రెడ్డి..!
- పీఏసీ చైర్మన్ రెడ్డి..!
- ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలు మినహా ప్రతి విభాగానికి అధ్యక్షులు రెడ్లే..!
తన పార్టీలో ఇలాంటి పరిస్థితి తెచ్చి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత.. సామాజిక న్యాయం గురించి మాట్లాడటం… మరీ హాస్యస్పదంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్లకు… తన సామాజికవర్గం తప్ప.. ఎవరూ కనిపించరు. పార్టీలో ప్రతి వ్యవస్థలోనూ… ఆయన సామాజికవర్గమే లీడ్ చేస్తుంది. చివరికి రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇన్చార్జులను కూడా… తన సామాజికవర్గాన్ని నియమిస్తారు. వాళ్లు చెప్పిన వారికే టిక్కెట్లు ఇస్తారు. పెత్తనం కూడా వాళ్లదే నడుస్తోంది. ఎమ్మెల్యేలు మాత్రం.. రిజర్వుడు కులాలకు చెందిన వారు ఉంటారు. పార్టీ తరపున వచ్చే అవకాశం ఉన్న అతి కొద్ది పదవులను కూడా.. రెడ్డి సామాజికవర్గానికే ఇచ్చేస్తారు. పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు రెండు సార్లు రాజ్యసభ సీట్లు వస్తే.. ఒక్కటీ బీసీలకు ఇవ్వలేదు. రెండు సార్లు రెడ్లకే అవకాశం ఇచ్చారు. పీసీసీ చీఫ్ గా చేసి… మంత్రిగా తిరుగులేని పెత్తనాన్ని .. అనుభవించిన బొత్స సత్యనారాయణ దగ్గర్నుంచి… ధర్మాన ప్రసాదరావు వరకూ చాలా మంది బీసీ వర్గాలకు చెందిన సీనియర్లు ఆ పార్టీలో ఉన్నారు. సామాజిక సమీకరణాల్లోనూ వారికి న్యాయం చేసే అలోచన జగన్ కు ఏ కోశానా … ఎప్పుడూ చేయలేదు. రాజ్యసభ హామీ ఇచ్చి బొత్సను పార్టీలో చేర్చుకున్నా.. పట్టించుకోలేదు. 2014 ఎన్నికల్లో రాయలసీమలో మొత్తం 53 నియోజకవర్గాల్లో రిజర్వుడు పోను… ఒకటి, రెండు మినహా అన్నీ రెడ్లకే ఇచ్చిన విషయం మర్చిపోయారా..?
పీఏసీ చైర్మన్ గా “కాపు” పనికిరారని తేల్చలేదా..?
అది కాపు ఉద్యమం ఉద్ధృతంగా జరుగుతున్న రోజులు. భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిపోయారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా రాజీనామా చేశారు. ఆ సమయంలో.. ఆ పదవికి.. కాపు సామాజికవర్గానికి ఇవ్వాలన్న సూచనలు వచ్చాయి. సీనియర్‌గా జ్యోతుల నెహ్రూ ఉన్నారు. కానీ… జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీలో ఏ పదవి కాపు సామాజికవర్గం వారు పొందడం ఇష్టం లేదు. అందుకే… మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పటికీ.. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అది కాపులను… సీనియార్టీని అవమానించడం కాదా..?. తన సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి పదవి ఇవ్వడానికి… జ్యోతుల నెహ్రును.. పక్కన కూడా కూర్చోవద్దని.. అవమానించి పంపేసిన మాట నిజం కాదా..?
వైసీపీ నేతల ఆవేదనకు ఏం సమాధానం చెబుతావు..?
ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని వర్గాల ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని.. దానికి తగ్గట్లుగా అందరికీ అవకాశాలు కల్పిస్తారు. కానీ ఒక్క వర్గానికే పూర్తిగా పార్టీని రాసిచ్చేసి.. మళ్లీ బయటకు వచ్చి.. ఇతర పార్టీలు, ప్రభుత్వంపై ఏ మాత్రం సిగ్గు పడకుండా నిందలేయడం ఏమిటి..? గతంలో రెహమాన్ లాంటి ముస్లింనేత కూడా.. వైసీపీ లో చోటు చేసుకుంటున్న ఈ సామాజికవర్గ వివక్షపై తీవ్ర ఆరోపణలు చేశారు. పేరుతో పాటు తోక ఉంటేనే వైసీపీలో ప్రాధాన్యం లభిస్తుందని.. లేకపోతే ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని మండిపడ్డారు. ఆ తర్వాత రెహమాన్.. వైసీపీ రాడార్ లో కనిపించకుండాపోయారు. బొత్స, ధర్మాన దగ్గర్నుంచి..ఎంతో మంది ప్రముఖ బీసీ నేతలు వైసీపీలో ఉన్నారు. కానీ వారెవరికైనా.. కనీస గౌరవం ఇస్తున్నారా..?
సామాజిక న్యాయం అనేది.. సొంత పార్టీలోనే చేయడానికి చేతులు రాని జగన్మోహన్ రెడ్డి.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది..? ఓ సామాజికవర్గంపై అంతు లేని ద్వేషం చూపి… అబద్దాలు ప్రచారం చేసి.. ఏదో చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. కుల, మత , రాగ ద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన రాజ్య పాలకుడి పదవికి అర్హుడేనా..?. ప్రజలే నిర్ణయించాలి..!