కాపు నేస్తం పథకం పేరుతో.. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఏపీ సర్కార్ రూ. 15వేలు పంపిణీ చేసింది. అయితే.. లబ్దిదారులు రెండున్నర లక్షల మందిలోపే ఉండటం వివాదాస్పదమవుతోంది. విపక్షాల విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పుడు.. కొత్తగా రాయలసీమలో అసలైన కాపులకు కాకుండా..రెడ్డి సామాజిక వర్గ మహిళలకు కాపు కోటాలో సాయం పంపిణీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమలో రెడ్డి సామాజికవర్గానికి కాపు అనే పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసింది. దశాబ్దాలుగా ఇదే సంప్రదాయం ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేసే విషయంలో రాయలసీమ ఇంజినీరింగ్ కాలేజీల్లో రెడ్డి విద్యార్థులు కూడా కాపు సర్టిఫికెట్లు సమర్పిస్తూ ఉంటారు. దీని వల్ల రీఎంబర్స్మెంట్ పథకం అమలులోనూ చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి.
దీనికి కారణం ఏదైనా కానీ.. ఇప్పుడు.. కాపు లుగా ఉన్న సర్టిఫికెట్లు చూపి.. రెడ్డి సామాజికవర్గ మహిళలకు రాయలసీమలో కాపు నేస్తం పథకం సొమ్ములు పంపిణీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత తులసీరెడ్డి ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. రాయలసీమలో నిజమైన కాపులకు…ఒక్క శాతం కూడా పథకం వర్తింప చేయలేదని.. రెడ్డి సామాజికవర్గానికే ఆ నిధులు వెళ్లాయని ఆయన ఆరోపిస్తున్నారు. పలు టీవీ చానళ్లలో డిబేట్లకు వెళ్లిన ఆయన ఇదే మాట చెబుతున్నారు.
కాపు సంఘాల నేతలు కూడా.. లబ్దిదారుల జాబితాను ప్రభుత్వం ఆన్ లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాపు కార్పొరేషన్ కింద పెన్షన్లు.. ఇతర పథకాల నిధులను చూపిస్తూ… కాపులను ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. కొత్తగా వారి పేరుతో ఇస్తున్న నిధులను కూడా రెడ్డి సామాజికవర్గానికే పంపిణీ చేశారన్న వివాదం రాజకీయ రచ్చకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.