కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందని ఓ సామెత! రెజీనా పరిస్థితికి అద్దం పడుతుందీ సామెత. నటిగా రెజీనా టాలెంట్ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. మంచి నటిగా పేరు అయితే వచ్చింది కానీ స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం రాలేదు. అలాగే, బ్రేక్ కూడా! ఒక అడుగు ముందు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా తెలుగులో కెరీర్ కొనసాగుతున్న తరుణంలో రెజీనాకు హిందీ సినిమా అవకాశం వచ్చింది. అప్పటికి ఓ సినిమా ప్రారంభమై మధ్యలో ఆగడంతో ఎగిరి గంతేసి మరీ ముంబై వెళ్లింది.
సోనమ్ కపూర్, అనిల్ కపూర్, జుహీ చావ్లా, రాజ్ కుమార్ రావ్ వంటి ఆర్టిస్టులు వుండటంతో ‘ఏక్ లడఖీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో తనకు పేరు వస్తుందని రెజీనా ఆశించింది. ఆమె అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొకటి. లెస్బియన్ లవ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సోనమ్ కపూర్ ప్రేయసి పాత్రలో రెజీనా నటించింది. సినిమాలో ట్విస్ట్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతో విడుదల ముందువరకూ రెజీనా స్టిల్స్ విడుదల చేయలేదు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే రెజీనా సన్నివేశాలు తక్కువ వున్నాయి. గొప్ప ఇంపార్టెన్స్ వున్న రోల్ కాదు. సినిమా గొప్ప హిట్టూ కాదు. దాంతో రెజీనా ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. ఆ మధ్య బికినీ వేసుకున్న తమిళ సినిమా ‘మిస్టర్ చంద్రమౌళి’ కూడా అంతంత మాత్రంగా ఆడింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఫంక్షన్లకి, ఇండస్ట్రీకి దూరంగా వుంది. రెండు మూడు అవకాశాలు తలుపు తట్టినా తీయలేదట! దాంతో ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రెజీనాకు వచ్చింది.