తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇటీవల కుదిపేసిన అంశాల్లో అమెరికాలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ ఒకటి. చికాగో కేంద్రంగా కిషన్ మోదుగుముడి దంపతులు నడిపిన ఈ రాకెట్లో కొందరు తెలుగు హీరోయిన్లకు భాగస్వామ్యం వుందని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో రెజీనా పేరూ ఈ పుకార్లలో వినిపించింది. తన ప్రమేయం లేకున్నా వదంతులు వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వాస్తవాలు తెసులుకోకుండా సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో పుకార్లపై స్పందించకపోవడమే ఉత్తమ స్పందన అన్నారామె. ఓ లైఫ్ స్టైల్ ఈవెంట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు అమెరికా సెక్స్ రాకెట్, కాస్టింగ్ కౌచ్ అంశాల గురించి స్పదించారామె.
రెజీనా మాట్లాడుతూ “నాపై వచ్చిన వార్తల్లో నిజం ఉన్నట్లయితే… ఏదో ఒక యాక్షన్ తీసుకునేవారు కదా. అందులో నిజం లేదని నాకు తెలుసు. కేవలం పబ్లిసిటీ కోసం ఎందుకు స్పందించాలని నేను మాట్లాడలేదు. నేను స్పందిస్తే దానిపై మరొకరు స్పందిస్తారు. పరిష్కారం కనిపించదు. అటువంటి అప్పుడు నేనెందుకు స్పందించాలి” అన్నారు.
పనిలో పనిగా మీడియాకి క్లాస్ పీకారు. “జనాలు తమకు ఏది కావాలో అది మాట్లాడతారు. మీడియా వాళ్ళు కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా. విలేకరులు ఏదైనా చెప్తే ప్రజలు నమ్ముతారు. అందుకని విలేకరులు మాట్లాడే సమయంలో నిజాలు తెలుసుకోవాలి. బాధ్యతగా మాట్లాడాలి” అని రెజీనా అన్నారు. చివర్లో ఇది నా విన్నపం మాత్రమేనని అన్నారు. సినిమా పరిశ్రమ చెడ్డది కాదనీ. ప్రతి పరిశ్రమలోనూ సమస్యలున్నాయనీ, అందుకు కార్పొరేట్ రంగమూ అతీతం కాదనీ, కాకపోతే కథానాయికలు కెమెరా ముందుంటున్నారు కాబట్టి అందరూ టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.