హైదరాబాద్: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రంతో హిట్ కొట్టి ఊపుమీద ఉన్న రెజీనా కసాండ్రా ఆ చిత్ర హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఎఫైర్ ఉందని జోరుగా సాగుతున్న ఊహాగానాలపై స్పందించారు. తేజ్‌తో చేయటం ఇది రెండోసారి కాబట్టి, ప్రణయ సన్నివేశాలతో సహా అతనితో కంఫర్టబుల్‌గా చేశానని చెప్పారు. మూడేళ్ళుగా పరిచయం ఉండటంవల్ల, నటుడిగా అతని ఎదుగుదలను తాను గమనిస్తూ ఉండటంవల్ల తమ ఇద్దరిమధ్య ఒక కంఫర్ట్ లెవల్, ఒక అనుబంధం ఉందని అన్నారు. నటుడిగానూ, వ్యక్తిగతంగానూ అతను తెలిసిఉండటంవల్ల అతని బాడీ ల్యాంగ్వేజ్ తనకు తెలుసని, అందుకే అతనితో పనిచేయటం తనకు తేలికయిందని చెప్పారు. తేజ్ తాను చేయబోయే సినిమాలన్నింటిలో రెజీనాను తీసుకోమని ఒత్తిడి చేస్తున్నాడని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు.
ఇప్పటివరకు తెలుగులో తాను చేసిన 11 సినిమాలలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రంలోని సీత క్యారెక్టరే బెస్ట్ అని చెప్పారు. బయటకూడా అందరూ అదే అంటున్నారని తెలిపారు. ఈ చిత్రంలో తాను చేసిన డాన్స్లుకూడా బాగా వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తాను తెలుగులో గోపీచంద్‌తో ఒకటి, మంచు మనోజ్‌తో ఒకటి చేస్తున్నానని, తమిళంలో సందీప్ కిషన్‌తో మరొక చిత్రం చేస్తున్నానని రెజీనా వెల్లడించారు. రానా దగ్గుబాటి సరసన ఒక చిత్రం బుక్ అయ్యానని, దీనికి కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తొలిసారిగా దర్శకత్వం చేస్తున్నారని రెజీనా తెలిపారు.