ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ జగన్ చేసిన ప్రకటనపై.. మూడు ప్రాంతాల్లో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో.. అక్కడి న్యాయవాద వర్గాలు సంతోషంగా ఉన్నాయి. విశాఖలో… కొంత మంది రాజకీయ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతిలో అసెంబ్లీ భవనాలు ఉంచుతామని చెప్పినా.. అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా మారింది. రైతులు ఆదోళనకు దిగారు. కర్నూలులో హైకోర్టును వ్యతిరేకిస్తున్నారంటూ.. కొంత మంది.. కోస్తా వాసులపై విమర్శలు ప్రారంభించారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకిస్తున్నారంటూ.. మరికొంత మంది విమర్శలు ప్రారంభించారు. మొత్తంగా.. మూడు ప్రాంతాల ప్రజలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో కనిపిస్తోంది
తమ ప్రాంతానికి గొప్ప అవకాశం వచ్చిందన్నట్లుగా కర్నూలు నేతలు.. విశాఖ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే.. ఇతర జిల్లాల్లో మాత్రం.. మాకేంటీ.. అనే ప్రశ్న ప్రారంభమయింది. మూడు జిల్లాలకు మూడు ప్రకటిస్తే.. మిగతా పది జిల్లాల్లో ఏం పెడతారనే చర్చ ప్రారంభమయింది. ఇది రాను రాను మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
నిన్నామొన్నటిదాకా.. అమరావతి రాజధాని ఎవరిది అనే చర్చ లేవదీశారు. దాన్ని ఆంధ్రుల రాజధానిగా కాకుండా.. ఓ సామాజికవర్గం రాజధానిగా ప్రచారం చేశారు. ఓ రాష్ట్రానికి రాజధాని అవసరం లేకపోయినా పర్వాలేదన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి… ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునేలా చేస్తున్నారు. మొత్తానికి విభజించు పాలించు.. అనే సిద్దాంతంతో… పాలకులు.. ప్రజల మధ్య మొట్టమొదటి చిచ్చును విజయవంతంగా పెట్టగలిగారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో.. వేచి చూడాల్సిందే..!